IND vs SL: శ్రీలంక ఆటగాడి మెడకు తీవ్ర గాయం.. ఆసుపత్రికి తరలింపు!
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ శ్రీలంక ఫీల్డర్ దినేష్ చండీమల్ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయిన చండీమల్‌కు మెడతో పాటు కుడి భుజానికి బలమైన గాయమైంది. దాంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
నాలుగో రోజు ఆట తొలి సెషన్ ఆరంభంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కేశర నువాంత వేసిన నాలుగో ఓవర్ ఆఖరి బంతిని కేఎల్ రాహుల్.. స్వీప్ షాట్‌తో డీప్ బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడగా.. దినేష్ చండీమల్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని ఆపే ప్రయత్నంలో కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతని కుడి భుజం బలంగా నేలకు తాకడంతో మెడకు తీవ్ర గాయమైంది. ఫిజియోలు పరీక్షించి అతన్ని ఆసుపత్రికి తరలించారు.

అయితే అతని స్కానింగ్ తీయించామని, అంతర్గత గాయాలు ఏమి లేవని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. కంకషన్ టెస్ట్‌లో చండిమాల్ విఫలమయ్యాడని, దాంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని తెలిపింది. అతని స్థానంలో పసిందు సూర్య బండార ఆడుతాడని పేర్కొంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు మ్యాచ్ రిఫరీ ఆమోదం తెలిపారని తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
దాంతో అనూహ్య పరిస్థితుల్లో సూర్య బండార అంతర్జాతీయ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేశాడు. అయితే తన రాకను ఘనంగా చాటుకోలేకపోయాడు. 372 పరుగుల లక్ష్య ఛేదన కోసం శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. సూర్య బండార(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మానవ్ సుతార్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
మానవ్ సుతార్‌తో పాటు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ సత్తా చాటడంతో శ్రీలంక 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో కెప్టెన్ దనంజయ డిసిల్వా(24 బ్యాటింగ్), సోనాల్ దినుషా(8 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 6 వికెట్లు అవసరం కాగా.. శ్రీలంక 300 ప్లస్ రన్స్ చేయాల్సి ఉంది.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)
భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 67/4 (ధనంజయ డిసిల్వా 26 నాటౌట్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
