
కొలంబో: భారత్ చేతిలో తొలి టీ20లో ఖంగుతిన్న శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టును గాయాల బెడద వేదిస్తోంది. యువ బ్యాట్స్‌మన్ భానుక రాజపక్స గాయంతో సిరీస్ మొత్తానికి దూరమవ్వగా.. కాస్త కూస్తో మెరుపులు మెరిపిస్తున్న ఆల్‌రౌండర్ చరిత్ అసలంక తదుపరి మ్యాచ్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అసలంక తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దాంతో అతను మంగళవారం జరిగే రెండో టీ20లో ఆడటం కష్టంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరు చాలదన్నట్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ పాతుమ్ నిస్సంక గాయపడ్డాడు. బంతి అతని భుజానికి బలంగా తాకింది. అతను ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.
భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన భానుక రాజపక్స.. ఆఖరి వన్డేలో అద్భుతంగా రాణించాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అదే జోరులో టీ20ల్లోకి అరంగేట్రం చేస్తారనుకుంటుండగా.. మోకాలి గాయంతో ఫస్ట్ టీ20కి దూరంగా ఉన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో 24, 0, 65 పరుగులు చేశాడు.
శ్రీలంకలో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో చరిత్ అసలంక ఒకడు. భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అసలంక ధనాధన్ బ్యాటింగ్‌తో మెరిసాడు. తొలి వన్డేలో 38, రెండో వన్డేలో 65, మూడో వన్డేలో 24 పరుగులు చేసిన అసలంక.. ఫస్ట్ టీ20లో బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ 44 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. తొలి టీ20లో బ్యాటింగ్ చేస్తుండగా అతని తొడకండరాలు పట్టేసాయి. దాంతో తదుపరి మ్యాచ్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అతను దూరమైతే శ్రీలంకకు కష్టాలు తప్పవు. ఇక నెట్స్‌లో గాయపడ్డ పాతుమ్ నిస్సంకకు ఇప్పటి వరకు భారత్‌తో ఆడే అవకాశం దక్కలేదు. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కోల్పోయిన శ్రీలంక.. టీ20 సిరీస్‌లో 1-0తో వెనుకంజలో ఉంది. సిరీస్‌లో నిలవాలంటే మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఆ జట్టు తప్పక గెలవాలి.
ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50)హాఫ్ సెంచరీతో రాణించగా.. శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం శ్రీలంక 18.3 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. చరిత్ అసలంక(44), అవిష్కా ఫెర్నాండో(26) మినహా అంతా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్ (4/22) నాలుగు వికెట్లతో లంక పతనాన్నిశాసించగా.. దీపక్ చాహర్(2/24) రెండు, వరుణ్ చక్రవర్తీ(1/28), యుజ్వేంద్ర చాహల్(1/19), హార్దిక్ పాండ్యా(1/17), కృనాల్ పాండ్యా(1/16)తలో వికెట్ తీశారు.