IND vs SL: కొంపముంచిన నోబాల్స్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్!

పుణే: కొత్త ఏడాది టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. శ్రీలంకతో గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ పోరాడి 16 పరుగులతో ఓటమిపాలైంది. అక్షర్ పటేల్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51)ల పోరాటం వృథా అయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్ డసన్ షనక(22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్లు కుశాల్ మెండీస్(52), పాతుమ్ నిస్సంక(33) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్(3/48) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసింది. అక్షర్‌తో కలిసి శివమ్ మావి(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) రాణించాడు. ఇక భారత బౌలర్లు 7 నోబాల్స్ వేయడం ఓటమిని శాసించింది. ఈ నో బాల్స్ ద్వారా శ్రీలంక అదనంగా 36 పరుగులు చేసింది. ఇందులో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ వేసాడు. ఈ అనవసర పరుగులే టీమిండియా ఓటమిని శాసించాయి.

టాప్-3 విఫలం..
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వరుస ఓవర్లలో టీమిండియా టాప్-3 వికెట్లను కోల్పోయింది. కాసున్ రజితా వేసిన రెండో ఓవర్‌లో ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ కాగా.. శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔటయ్యాడు. మదుషంక వేసిన ఆ మరుసటి ఓవర్‌లో అరంగేట్ర ప్లేయర్ రాహుల్ త్రిపాటి(5) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సిక్స్, ఫోర్‌తో జోరు కనబర్చినా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. కరుణరత్నే వేసిన ఐదో ఓవర్‌లో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో టీమిండియా 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో కలిసి సూర్యకుమార్ యాదవ్ తన శైలికి భిన్నంగా ఆచితూచి ఆడాడు.

శైలికి భిన్నంగా..
విరాట్ కోహ్లీ తరహాలో యాంకర్ రోల్ పోషించాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 4 వికెట్లకు 39 పరుగులు చేసింది. ఆ తర్వాత కాస్త ఆచితూచి ఆడిన ఈ జోడీని హసరంగా విడదీసాడు. దీపక్ హుడా(9)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 57 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్.. సూర్యతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సిక్సర్‌తో పరుగుల ఖాతాను తెరిచిన అక్షర్ పటేల్ అదే జోరు కొనసాగించాడు.

హ్యాట్రిక్ సిక్స్‌లతో అక్షర్ హల్‌చల్..
ఇక హసరంగా వేసిన 14వ ఓవర్‌లో అక్షర్ పటేల్ వరుసగా మూడు సిక్స్‌లు బాదగా.. సూర్య మరో సిక్స్ కొట్టడంతో 26 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్‌లో సూర్య సిక్సర్ కొట్టగా.. అక్షర్ సైతం సిక్సర్ బాది 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య సైతం మదుషంక బౌలింగ్‌లో సిక్స్ బాది 33 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ ఇద్దరి జోరుతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. కానీ ఇదే ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో 6వ వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

మెరిసిన శివమ్ మావి..
క్రీజులోకి వచ్చిన శివమ్ మావి.. మదుషంక వేసిన 18వ ఓవర్‌లో వరుసగా 6, 4, 6 కొట్టి 17 పరుగులు పిండుకున్నాడు. దాంతో భారత్ విజయానికి 12 బంతుల్లో 33 పరుగులు అవసరమయ్యాయి. రజితా వేసిన 19వ ఓవర్‌లో రెండు వైడ్లతో 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో భారత్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతులకు మూడు పరుగులే రాగా.. మూడో బంతికి అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్ శ్రీలంక వశమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications