శ్రీలంక పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్.. నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల శకం ఘన విజయంతో మొదలైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 43 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), శుభ్‌మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) ధాటిగా ఆడారు.

శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, అసిత ఫెర్నాండో, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79), కుశాల్ మెండీస్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 45) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్(3/5) మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసారు.
ఓపెనర్ల విధ్వంసం..
214 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారత్ తరహాలోనే దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టారు. తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించిన అనంతరం కుశాల్ మెండీస్‌ను అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
మలుపు తిప్పిన అక్షర్ పటేల్..
క్రీజులోకి వచ్చిన కుశాల్ పెరీరాతో కలిసి పాతుమ్ నిస్సంక ధాటిగాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాతుమ్ నిస్సంక.. భారీ సిక్సర్లతో సెంచరీతో దిశగా సాగాడు. కానీ ప్రమాదకరంగా మారిన అతన్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేసాడు. అదే ఓవర్‌లో కుశాల్ పెరీరాను కూడా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
క్రీజులోకి వచ్చిన చరిత్ అసలంక(0) డకౌటవ్వగా.. డసన్ షనక(0) సిరాజ్ సూపర్ త్రోకు రనౌటయ్యాడు. ఒక్క బంతి కూడా ఆడకుండానే డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో గెలిచేలా కనిపించిన శ్రీలంక ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. కామిందు మెండీస్(8 బంతుల్లో 2 ఫోర్లతో 12)ను రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక ఓటమి ఖాయమైంది.
సిరాజ్ బౌలింగ్‌లో మతీష పతీరణ(6) ఔటవ్వగా.. రియాన్ పరాగ్ వేసిన ఆఖరి ఓవర్‌లో మహీష్ తీక్షణ(2), దిల్షాన్ మదుషంక(0)లను వరుసగా పెవిలియన్ చేర్చి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.