
ముంబై: దీపక్ హుడా(23 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 41 నాటౌట్), అక్షర్ పటేల్(20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగడంతో శ్రీలంకతో తొలి టీ20లో టీమిండియా 163 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్ దిశగా సాగిన టీమిండియాకు ఈ జోడీ అసాధారణ బ్యాటింగ్‌తో పోరాడే లక్ష్యాన్ని అందించింది. దాంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(29), ఇషాన్ కిషన్ పర్వాలేదనపించారు. లంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజ డిసిల్వా, వానిందు హసరంగా ఐదు వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే అరంగేట్ర ప్లేయర్ శుభ్‌మన్ గిల్(7) ఎల్బీగా వెనుదిరిగాడు. తీక్షణ బౌలింగ్‌ను అంచనా వేయలేకపోయిన అతను వికెట్లు ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(7) బౌండరీతో దూకుడు కనబర్చాడు. కానీ అదే జోరులో కరుణరత్నే బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో టీమిండియా పవర్‌ప్లేలో 2 వికెట్లకు 41 రన్స్ చేసింది.
ఆ వెంటనే సంజూ శాంసన్(5) కూడా విఫలమయ్యాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అనవసర షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(29).. ఇషాన్ కిషన్(37)తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ హార్దిక్ పాండ్యాను మదుషంక ఔట్ చేయగా.. ఇషాన్ కిషన్ హసరంగా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా(41 నాటౌట్), అక్షర్ పటేల్(31 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. దీపక్ హుడా అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఈ జోడీ చివరి 35 బంతుల్లో 68 పరుగులు చేసింది.