శ్రీలంక పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం ఉత్కంఠగా సాగిన ఆఖరి టీ20లో టీమిండియా సూపర్ ఓవర్‌లో గట్టెక్కింది.
సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను శ్రీలంక.. మరోసారి లోయరార్డర్ వైఫల్యంతో చేజార్చుకుంది. 5 వికెట్లను చేతిలో పెట్టుకొని 12 బంతుల్లో 9 పరుగులు చేయలేకపోయింది. టీమిండియా పార్ట్ టైమ్ స్పిన్నర్స్ రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ సంచలన బౌలింగ్‌తో ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు అద్భుత విజయాన్నందుకుంది. సూపర్ ఓవర్‌లో లంక పతనాన్ని వాషింగ్టన్ సుందర్ శాసించాడు.

స్కోర్లు టై
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(37 బంతుల్లో 3 ఫోర్లతో 39)తో పాటు రియాన్ పరాగ్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 26), వాషింగ్టన్ సుందర్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(2/29) రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ(3/28) మూడు వికెట్లు పడగొట్టాడు. చామిందు విక్రమిసంఘే, అసితా ఫెర్నాండో, రమేష్ మెండీస్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్(41 బంతుల్లో 3 ఫోర్లతో 43), కుశాల్ పెరీరా(34 బంతుల్లో 5 ఫోర్లతో 46), పాతుమ్ నిస్సంక(27 బంతుల్లో 5 ఫోర్లతో 26) రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ రెండేసి వికెట్లు తీసారు.
సూపర్ ఓవర్‌లో సూరీడి విన్నింగ్ షాట్..
వైడ్‌తో సూపర్ ఓవర్‌ను ప్రారంభించిన వాషింగ్టన్ సుందర్.. తొలి బంతికి సింగిల్ ఇచ్చాడు. తర్వాతి రెండు బంతుల్లో కుశాల్ పెరీరా(0), పాతుమ్ నిస్సంక(0) లను క్యాచ్ ఔట్ చేసి శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెరదించాడు. మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. తీక్షణ వేసిన తొలి బంతినే కెప్టెన్ సూర్య బౌండరీ తరలించి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఓపెనర్ల శుభారంభం..
అంతకుముందు 138 పరుగుల లక్ష్యచేధనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. భారత బ్యాటర్లు తడబడ్డ వికెట్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పాతుమ్ నిస్సంకను రవి బిష్ణోయ్ ఔట్ చేసినా.. కుశాల్ పెరీరాతో కలిసి కుశాల్ మెండీస్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అనంతరం కుశాల్ మెండీస్‌ను బిష్ణోయ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన హసరంగా(3), చరిత్ అసలంక(0)లను సుందర్ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు.
మలుపు తిప్పిన రింకూ సింగ్..
19వ ఓవర్‌ను రింకూ సింగ్‌కు ఇచ్చి ఆశ్చర్యపరిచిన సూర్య.. అనూహ్య ఫలితాన్ని అందుకున్నాడు. ఆచితూచి ఆడుతున్న కుశాల్ పెరీరాను రింకూ సింగ్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్ చివరి బంతికి రమేశ్ మెండీస్(3)ను కూడా ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌కు దిగాడు.
తొలి బంతిని డాట్ చేసిన అతను తర్వాతి రెండు బంతుల్లో వరుసగా వికెట్లు తీసాడు. కామిందు మెండీస్(1)తో పాటు తీక్షణను(0)పెవిలియన్ చేర్చాడు. నాలుగో బంతికి అసితా ఫెర్నాండో సింగిల్ తీయగా.. విక్రమ సింఘే చివరి రెండు బంతుల్లో క్విక్ డబుల్స్ తీసి మ్యాచ్‌ను టై చేశాడు. రనౌట్ చేసే అవకాశాలను భారత ఆటగాళ్లు చేజార్చారు. దాంతో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.