సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ షాడో కెప్టెన్ అవతారమెత్తాడు. కెప్టెన్ రోహిత్ శర్మనే అయినా.. మైదానంలో కోహ్లీనే జట్టును నడిపించాడు. బౌలింగ్ మార్పులు.. ఫీల్డ్ సెటప్‌తో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు ఔటయ్యేలా ప్లాన్ రచించడంలోనూ కోహ్లీనే కీలక పాత్ర పోషించాడు.
కోహ్లీ సూచనలతో భారత బౌలర్లు చెలరేగగా.. సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా సౌతాఫ్రికా లోయరార్డర్ బ్యాటర్ మార్కో జాన్సెన్ వికెట్ కోసం విరాట్ కోహ్లీ రచించిన ప్లాన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. బంతి వేసే ముందు సిరాజ్‌కు సైగలతో సలహా ఇచ్చాడు.

ఇన్‌స్వింగర్ వేయాలని.. బ్యాటర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేస్తాడని, అప్పుడు క్యాచ్ వస్తుందని సైగలతో సూచించాడు. కోహ్లీ చెప్పినట్లుగానే సిరాజ్ స్వింగర్ వేయగా.. మార్కో జాన్సెన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అద్భుతంగా టర్న్ అయిన బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలో పడింది.
ఈ బంతికి మార్కో జాన్సెన్ నోరెళ్ల బెట్టి నిరాశగా పెవిలియన్ చేరగా.. సిరాజ్, కోహ్లీ సంబరాలు చేసుకున్నారు. ఈ వికెట్‌తోనే సిరాజ్ ఐదు వికెట్ల ఫీట్ అందుకున్నాడు. 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా విరాట్ కోహ్లీ కీలక సలహాలు ఇచ్చాడు. బౌలింగ్ మార్పులు.. ఫీల్డ్ సెటప్ గురించి ప్రత్యేకంగా చర్చించి పలు సూచనలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు సిరాజ్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. వరుస ఓవర్లలో సౌతాఫ్రికా బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. సిరాజ్‌తో పాటు ముఖేష్ కుమార్(2/0), జస్‌ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 23.2 ఓవర్లలో 55 పరుగులకే ముగించింది.