IND vs SA: కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డుకే ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగే మూడు టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. అది ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిటే ఉండటం విశేషం. ఆతిథ్య సౌతాఫ్రికాతో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టేస్ట్‌లో విరాట్ కోహ్లీ గనుక 66 పరుగులు చేస్తే ద్రవిడ్ రికార్డు బద్దలువుతోంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలుస్తాడు.

10 ఇన్నింగ్స్‌ల్లోనే..
సఫారీ గడ్డపై రాహుల్ ద్రవిడ్ 22 ఇన్నింగ్స్‌ల్లో 624 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 29.71గా ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా గడ్డపై 10 ఇన్నింగ్స్‌ల్లోనే 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ద్రవిడ్ కంటే కేవలం 66 పరుగులు మాత్రమే వెనుకంజలో ఉన్నాడు. వాటిని ఈ సిరీస్‌లో చేస్తే.. సఫారీ గడ్డపై టెస్టుల్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో కోహ్లీ.. ద్రవిడ్‌ను దాటి రెండో స్థానానికి చేరతాడు.

టాప్‌లో సచిన్..
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 1161 పరుగులతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. క్రికెట్ గాడ్ సౌతాఫ్రికా పిచ్‌లపై 15 టెస్టులాడి 46.44 సగటుతో 1161 పరుగులు సాధించారు. ఇందులో ఐదు సెంచరీలు, మూడు అర్ధశతకాలు ఉండటం విశేషం. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ అవ్వడం చాలా కష్టం. ఇక హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ 18 ఇన్నింగ్స్‌ల్లో 556 రన్స్ చేసి ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

177 రన్స్ చేస్తే..
ఇక 177 పరుగులు చేస్తే ద్రవిడ్ పేరిట ఉన్న మరో రికార్డును కూడా విరాట్ కోహ్లీ అధిగమిస్తాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో సౌతాఫ్రికా జట్టుపై ఓవరాల్‌గా ద్రవిడ్ 33.83 యావరేజ్‌తో 1252 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు సౌతాఫ్రికాపై 12 టెస్ట్‌ల్లో 59.72 సగటుతో 1075 రన్స్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ 25 టెస్ట్‌ల్లో 1741 రన్స్‌తో టాప్‌లో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ 15 టెస్ట్‌ల్లో 1306 రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

ప్రేక్షకుల్లేకుండానే..
డిసెంబర్ 26-30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. జనవరి 3-7 వరకు జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్, జనవరి 11-15 వరకు కేప్‌టౌన్‌లో మూడో టెస్ట్ జరగనుంది. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ముందు షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉండగా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ) ప్రకటించింది. ఆదివారం నుంచి మొదలయ్యే తొలి టెస్టు సహా మున్ముందు జరిగే ఇతర మ్యాచ్‌లకు కూడా అభిమానుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచడం లేదని సీఎస్‌ఏ వెల్లడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications