టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో చిందేసాడు. పాత కోహ్లీని తలపిస్తూ ఆటను ఆస్వాదిస్తున్నాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో సెంచరీల మోత మోగిస్తున్న కోహ్లీ.. ఫీల్డింగ్‌లోనూ చురుకుగా ఉంటూ జట్టును ఉత్సాహపరుస్తున్నాడు. బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కోహ్లీ నాగిని డ్యాన్స్ చేశాడు. నాగుపాము సైగలతో చిందేసాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లోనూ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. కెరీర్‌లో 84వ శతకం సాధించాడు. వన్డేల్లో 53వ సెంచరీ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీకి వరుసగా రెండో సెంచరీ కాగా.. సౌతాఫ్రికాపై హ్యాట్రిక్ శతకం. ఈ సెంచరీతో మంచి జోష్‌లో కనిపించిన కోహ్లీ.. మైదానంలో దూకుడుగా కనిపించాడు. సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులను ఉత్సాహపరిచాడు. వికెట్ పడినప్పుడు గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత వింటేజ్ కోహ్లీ కనిపించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఔట్ కాగా.. క్రీజులోకి టెంబా బవుమా వచ్చాడు. బవుమా బంతిని ఎదుర్కొనే ముందు కవర్స్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లీ నాగిని డ్యాన్స్‌తో అభిమానులను ఉత్సాహపరిచాడు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పాత కోహ్లీ బయటకు వచ్చాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(2/63) రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(1/43), లుంగి ఎంగిడి(1/51) చెరో వికెట్ తీసారు.
అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలలో 6 వికెట్లకు 362 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రిట్జ్‌కే(64 బంతుల్లో 5 ఫోర్లతో 68), డెవాల్డ్ బ్రెవిస్(34 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.