
కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో మూడో టెస్ట్‌కు ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తోంది. కేప్‌టౌన్ వేదికగా మంగళవారం నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభమయ్యే మూడో టెస్టులో అతను మరో 14 పరుగులు సాధిస్తే.. ఆ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానంలో నిలుస్తాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు చెందిన రికార్డును బ్రేక్ చేస్తాడు.
దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఇప్పటికే సౌతాఫ్రికాలో 15 టెస్టులు ఆడగా.. 1,161 పరుగులతో అందరికన్నా ముందున్నాడు. అందులో మూడు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తర్వాత రాహుల్ ద్రవిడ్ 11 టెస్టుల్లో 624 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ ఇప్పటివరకు సఫారీ గడ్డపై 6 టెస్టులే ఆడగా.. 611 పరుగులు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టులో ఆడలేకపోయిన కోహ్లీ ఇప్పుడు మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని అతనే స్పష్టం చేశాడు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడో టెస్ట్ ఆడుతానని చెప్పాడు. అంతకుముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ (35, 18) పరుగులే చేసి నిరాశపరిచాడు. మరోవైపు గత రెండేళ్లకు పైగా ఒక్క సెంచరీ సాధించకపోవడంతో చివరి టెస్టులోనైనా దాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగి టీమిండియా విజయం సాధిస్తే కోహ్లీసేన సౌతాఫ్రికా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.