సెల్ఫీ కోసం రూ.23 వేలు ఖర్చు!
తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఎలాగైన సెల్ఫీ దిగాలని భావించిన ఓ అభిమాని ఏకంగా రూ.23 వేల 400 రూపాయలు ఖర్చు పెట్టి మరీ తన కోరికను తీర్చుకున్నాడు. గౌహతిలోని శాంతిపూర్‌కు చెందిన రాహుల్ రాయ్.. విరాట్‌తో సెల్ఫీ దిగాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ గౌహతీ వేదికగా జరుగుతుందని తెలిసినప్పటి నుంచే సెల్ఫీ దిగడానికి ప్రణాళికలు రచించాడు. సెప్టెంబర్ 29న టీమిండియా గౌహతి చేరుకోగా.. ఎయిర్‌పోర్ట్‌లోనే సెల్ఫీ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. సెక్యూరిటీ ధాటు కొని కోహ్లీ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించినా కుదురలేదు. టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న అస్సాం క్రికెట్ అసోసియేషన్ బర్సపర స్టేడియంకు వెళ్లినా సెక్యూరిటీ అనుమతించలేదు.

హోట్‌ల్ గది బుక్ చేసుకోని..
దాంతో స్మార్ట్‌గా ఆలోచించిన రాహుల్.. టీమిండియా బస చేస్తున్న హోటల్‌లో ఓ రాత్రికి రూ. 23, 400 చెల్లించి రూమ్ బుక్ చేసుకున్నాడు. హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ సమయంలో కోహ్లీ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించి సెక్యూరిటీ అతన్ని అడ్డుకుంది. వారిని ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. అతని ప్రయత్నాలను చూసిన విరాట్.. సెక్యూరిటీని వారించాడు. దాంతో రాహుల్ రాయ్ తన అభిమాన క్రికెటర్‌ను కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియా అతను షేర్ చేయగా.. వైరల్ అయ్యాయి. దాంతో అతన్ని న్యూస్ 18 చానెల్ ఇంటర్వ్యూ చేసింది. తన కల నేరవేరిందని రాహుల్ రాయ్ సంతోషం వ్యక్తం చేశాడు.

చాలా సంతోషంగా ఉంది..
'నాకు హోటల్‌లో గది దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. బ్రేక్‌ఫాస్ట్ బేలో నేను విరాట్ కోహ్లీని చూసి అరిచాను. అతని పిలిచేందుకు ప్రయత్నించాను. కానీ సెక్యూరిటీ నన్ను అడ్డుకుంది. కానీ నేను మాత్రం ఎలాగైనా విరాట్‌ను కలవాలని గట్టిగా అనుకున్నాను. చివరి ప్రయత్నంగా.. చాలా ఆకలిగా ఉందని హోటల్ సిబ్బందికి చెప్పి మరోసారి బ్రేక్‌ఫాస్ట్ ఏరియాకు వెళ్లాను. తినడం కన్నా కోహ్లీని కలవడమే నా ప్రధాన లక్ష్యం. నా ప్రయత్నాన్ని గమనించిన విరాట్.. సెక్యూరిటీని వారించి పంపించమని చెప్పాడు. దాంతో నేను విరాట్ కోహ్లీని కలిసాను. విరాట్ కోహ్లీ పేరిట నేను నిర్వహిస్తున్న ఓ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాన్ పేజీకి సంబంధించిన ఫ్రేమ్‌ను అందజేసాను. అయితే ఆ ఫ్రేమ్‌ను తాను తీసుకెళ్లలేనని చెప్పిన విరాట్.. దానిపై సంతకం చేసి నా దగ్గరగనే ఉంచుకోమని చెప్పాడు. ఆ తర్వాత మేం ఇద్దరం సెల్ఫీదిగాం'అని రాహుల్ రాయ్ చెప్పుకొచ్చాడు.

పిచ్చి పీక్స్..
అయితే రాహుల్ రాయ్ చేసిన ప్రయత్నంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ కలవడం గొప్ప విషయమని, చాలా స్మార్ట్‌గా ఆలోచించావు బ్రదర్ అని కొందరు మెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.పిచ్చి పీక్స్‌కు చేరడం అంటే ఇదేనని, సెల్ఫీ కోసం రూ.23 వేలు ఖర్చు పెట్టడమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవే డబ్బులు విరాట్ కోహ్లీ పేరిట సహాయ కార్యక్రమాలు చేసిన మంచి పేరు వచ్చేదని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












