టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. భవిష్యత్తు తరాలకు అవకాశం ఇవ్వాలనే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.
శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ అవార్డ్ అందుకున్న అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 'ఇది నా చివరి టీ20 ప్రపంచకప్. మేం సాధించాలనుకున్నది కూడా ఈ విజయమే. ఆ దేవుడు చాలా గొప్పవాడు. కీలక మ్యాచ్‌లో జట్టును గెలిపించే అవకాశాన్ని నాకిచ్చాడు. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు.
భారత్ తరఫున ఇదే నా చివరి టీ20 మ్యాచ్. ప్రపంచకప్ గెలవాలని మేం అనుకున్నాం. అలాగే సాధించాం. అంతర్జాతీయ టీ20ల నుంచి నేను తప్పుకోవాలనుకుంటున్నది అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ ఈ ఫైనల్లో ఓడినా నేను రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. భవిష్యత్తు తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఐపీఎల్‌లో కుర్రాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. వాళ్లు భారత జెండాను రెపరెపలాడిస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మేం ఐసీసీ టైటిల్ గెలిచాం. నాకు ఒక్కడికే కాదు. రోహిత్ 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడాడు. నేను 6 టోర్నీలే ఆడాను. ఈ విజయానికి రోహిత్ పూర్తి అర్హుడు. ఎట్టకేలకు ఐసీసీ టైటిల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో నేను విఫలమయ్యాను. నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లింది. కానీ ఆ దేవుడు దయ వల్ల కీలక మ్యాచ్‌లో రాణించగలిగాను.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ ఫైనల్లో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ.. అక్షర్ పటేల్‌తో కలిసి ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించి భారీ స్కోర్ అందించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 47)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిపాలైంది. హెన్రీచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/20) మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/18), అర్ష్‌దీప్ సింగ్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసాడు.