సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తయిన టీమిండియా.. చివరి పోరుకు సిద్దమవుతోంది. జనవరి 3(బుధవారం) నుంచి కేప్‌టౌన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా.. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ సమం చేయడంతో పాటు విజయంతో సౌతాఫ్రికా పర్యటనను ముగించాలనుకుంటోంది.
ప్రస్తుతం సెంచూరియన్‌లోనే ఉన్న టీమిండియా.. శనివారం ముమ్మరంగా సాధన చేసింది. టీమ్ ఆప్షనల్ ప్రాక్టీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు డుమ్మా కొట్టారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలతో పాటు యువ ఆటగాళ్లు ఈ ఆప్షనల్ ప్రాక్టీస్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తన బలహీనతను అధిగమించడంపై ఫోకస్ పెట్టాడు. షాట్ పిచ్ బాల్స్, ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను బాగా ప్రాక్టీస్ చేశాడు. పుల్ షాట్లతో నెట్స్‌లో అలరించాడు.
వెన్ను గాయంతో తొలి టెస్ట్‌కు దూరమైన రవీంద్ర జడేజా సైతం బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. యశస్వీ జైస్వాల్ సైతం గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ముఖేష్ కుమార్, రవీచంద్రన్ అశ్విన్, ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణలు సైతం ప్రాక్టీస్ చూస్తూ కనిపించారు. ఈ ప్రాక్టీస్ సెషన్‌ను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పర్యవేక్షించాడు.
ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సైతం కొన్ని డ్రిల్స్ చేయించాడు. తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మినహా మరే బౌలర్ రాణించలేదు.
ఈ క్రమంలోనే రెండో టెస్ట్‌కు టీమిండియా తుది జట్టులో మార్పు చేయనుంది. బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపని ప్రసిధ్ కృష్ణపై వేటు వేసి ముఖేష్ కుమార్‌కు అవకాశం ఇవ్వనుంది. జడేజా అందుబాటులోకి రావడంతో అశ్విన్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. శార్దూల్ ఠాకూర్‌ను కూడా పక్కనపెట్టాలనుకుంటే ఆవేశ్ ఖాన్ బరిలోకి దిగుతాడు.