
జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తాత్కలిక సారథి కేఎల్ రాహుల్‌ను ఫీల్డ్ అంపైర్ మందలించాడు. కాస్త వేగంగా స్పందిచాలని భారత కెప్టెన్‌ను హెచ్చరించాడు. అసలేం జరిగిందంటే.. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా వేసిన 5వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతి వేయడానికి రబడా సిద్దమవ్వగా.. కేఎల్ రాహుల్ వద్దని వారిస్తూ.. వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో.. రబడా బంతి విసరడాన్ని నిలిపివేయగా.. ఫీల్డ్ అంపైర్ మారైస్ ఎరాస్మస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
వేగవంతమైన రనప్‌తో వచ్చిన కగిసో రబాడ గుర్రుగా చూడటంతో కేఎల్ రాహుల్ అతనితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకి కూడా క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. ఫీల్డ్ అంపైర్ మారైస్ ఎరాస్మస్ ''కేఎల్ కాస్త వేగంగా స్పందించేందుకు ప్రయత్నించు'' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. సాధారణంగా బౌలర్ రనప్ తీసుకోగానే బ్యాట్స్‌మెన్ క్రీజులో స్టాన్స్ తీసుకుని.. బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంటాడు. కానీ.. ఇక్కడ రబడా రనప్ పూర్తయిన తర్వాత కూడా కేఎల్ రాహుల్ పూర్తి స్థాయిలో స్టాన్స్ తీసుకున్నట్లు కనిపించలేదు. దాంతో రబడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు మార్కో జాన్సెన్(4/31), కగిసో రబడా(3/64), ఒలివియర్(3/64) సమష్టిగా చెలరేగడంతో భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్(133 బంతుల్లో 9 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవిచంద్రన్ అశ్విన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 46) విలువైన పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ మినహా మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌటవ్వగా.. మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బుమ్రా(14 నాటౌట్) ఓ సిక్స్ రెండు బౌండరీలతో 200 మార్క్‌ను ధాటించి పరువు కాపాడాడు.