
కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లుచెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సూపర్ డైవ్‌తో బంతిని అద్భుతంగా అందుకొని కెరీర్‌లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో టెంబా బవుమా ఇచ్చిన స్లిప్ క్యాచ్‌ను భారత కెప్టెన్ అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. విరాట్ సూపర్ ఫీల్డింగ్‌కు బవుమా(28) బిత్తరపోయాడు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 56వ ఓవర్‌లో షమీ వేసిన రెండో బంతిని టెంబా బవుమా డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి స్లిప్ వైపుకు దూసుకెళ్లింది. ఇక తన ఎడమవైపు దూసుకొచ్చిన బంతిని విరాట్ అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. ఇక టెస్ట్ క్రికెట్‌లో విరాట్‌కు ఇది 100వ క్యాచ్. విరాట్ సూపర్ క్యాచ్‌తో ఐదో వికెట్‌కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కైల్ వెరీన్(0) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో సౌతాఫ్రికా 159 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. 'వాటే ప్లేయర్.. వాటే ఫీల్డర్' అంటూ ప్రశంసిస్తున్నారు.
అంతకు ముందు 17/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మార్క్‌రమ్(8)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. నైట్ వాచ్‌మన్ కేశవ్ మహరాజ్(25)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన పీటర్సన్(68 బ్యాటింగ్), డస్సెన్ ఆచితూచి ఆడారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డస్సెన్‌ను ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. బవుమాతో జతకలిసిన పీటర్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇక బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమవడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 77.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 79) అర్ధ సెంచరీ సాధించగా, చతేశ్వర్ పుజారా (77 బంతుల్లో 7 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు. రబడా 73 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జాన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి.