నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లోనూ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సూర్య టాస్ ఓడిపోవడం విశేషం. మరోవైపు టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ మళ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ మార్క్‌రమ్ టాస్ గెలిచి ఇదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
'మేం మళ్లీ ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. మేం ఇంకా ఉత్తమ ప్రదర్శన చేయలేదు. నెమ్మదిగా పురోగతి సాధిస్తున్నా. రెండో టీ20లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. బ్యాటర్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మిడిలార్డర్ క్రీజులో నిలబడాలి. మరోసారి నిరాశపర్చకూడదు. మా బ్యాటింగ్ యూనిట్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఈ రాత్రి మేం ప్రత్యేకంగా ఏదైనా చేస్తామని ఆశిస్తున్నా.'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాము బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'టాస్ ఓడిపోయినా పర్లేదు. గెలిచినా బ్యాటింగ్ ఎంచుకునేవాడిని. గత రెండు మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి అద్భుత ప్రదర్శన కనబర్చాం. మా కుర్రాళ్లు స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మైదానంలోకి వెళ్లి ఆటను ఆస్వాదించండని మా కుర్రాళ్లకు చెప్పాను. మా ఆటగాళ్లు కెప్టెన్‌గా నా పనిని తేలిక చేస్తున్నారు. తుది జట్టులో ఒక మార్పు చేశాం.
ఈ మ్యాచ్‌తో రమణ్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. కానీ టీమ్ కాంబినేషన్‌లో భాగంగా ఒక బౌలర్‌ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ మార్పు చేశాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ఆరంభించి, ఆపై రెండో మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. మరో విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్‌పై పట్టు చిక్కనుంది. ఓడితే మాత్రం సీరిస్ సాధించే అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
తుది జట్ల(అంచనా)
భారత్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ.
సౌతాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే సిమెలెన్, లుతో సిపమ్లా, గెరాల్డ్ కోయిట్జీ, కేశవ్ మహరాజ్