సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌కు అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యారని టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్‌గా కనిపిస్తోంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ పెద్దగా మారుతుందని అనుకోను. సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ వస్తుంది. కాబట్టి మేం ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది అద్భుతమైన ప్రదేశం, మైదానం. ఇక్కడి ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాం. మాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే. రెండో టీ20లో సౌతాఫ్రికా పుంజుకున్న తీరు ఈ ఆట అందం.
ఎలా పుంజుకున్నామన్నదే ముఖ్యం. మేం నిర్భయంగా క్రికెట్ ఆడాలని, ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. పిచ్ బాగుంది. తప్పని పరిస్థితుల్లో తుది జట్టులో రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. అస్వస్థతో అక్షర్ పటేల్ దూరం కాగా.. వ్యక్తిగత కారణాలతో బుమ్రా ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఇద్దరి స్థానాల్లో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, భారీ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. ' వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇది ఒక అందమైన వేదిక. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ వికెట్‌లో మార్పు ఉంటుంది. బ్యాటింగ్‌కు మంచిగా స్పందిస్తోంది. తొలి టీ20లో మేం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ రెండో టీ20లో మేం పుంజుకున్న తీరు అద్భుతం.
ఈ మ్యాచ్‌లో రాణించడం కీలకం. ఈ మ్యాచ్ మాకు ఒక సవాల్. మేం పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలి. మేం మంచి స్కోరు సాధిస్తామని ఆశిస్తున్నా. మేము ఇక్కడ కొన్ని మ్యాచ్‌లు ఆడాం. మా ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తుది జట్టులో మూడు మార్పులు చేశాం. మిల్లర్, లిండే, సిపమ్లా దూరం కాగా.. బోష్, నోర్జ్, స్టబ్స్ తుది జట్టులోకి వచ్చారు.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ఆన్రిచ్ నోర్ట్జే, లుంగీ ఎంగిడి, ఓట్నియెల్ బార్ట్‌మాన్.