IND vs SA: టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగాడు.
సూర్యకు ఇది నాలుగో టీ20 సెంచరీ. దాంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సూర్య సమం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు శతకాలు నమోదు చేశాడు. రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు.

టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సూర్య మూడో స్థానంలో ఉన్నాడు. సూర్య తర్వాత మూడేసి శతకాలతో బాబర్ ఆజామ్, కొలిన్ మున్రో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలి 9 బంతుల్లో 18 పరుగులు చేసిన సూర్య.. తర్వాత 20 బంతుల్లో 17 రన్స్ మాత్రమే చేశాడు. చివరి 26 బంతుల్లో మాత్రం 65 పరుగులు సాధించాడు.
ఇక టీ20ల్లో సౌతాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా సూర్య చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికాపై ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య.. వరుసగా 50*, 61, 8, 68, 56, 100 పరుగులు చేశాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే విఫలమయ్యాడు. ఇక సూర్య తన నాలుగు టీ20 శతకాలను నాలుగు దేశాల్లో సాధించడం విశేషం. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా గడ్డపై సూర్య ఈ శతకాలను అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 8 సిక్స్‌లు బాదిన సూర్య.. టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(140 ఇన్నింగ్స్‌ల్లో 182) టాప్‌లో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(57 ఇన్నింగ్స్‌ల్లో 123) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ(107 ఇన్నింగ్స్‌ల్లో 1170 మూడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో కెప్టెన్‌గా శతకం బాదిన రెండో భారత సారథిగా కూడా సూర్య నిలిచాడు. గతంలో రోహిత్ రెండు సార్లు కెప్టెన్‌గా శతకాలు నమోదు చేశాడు.
సూర్య శతకంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు.