సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. తొలి ఓటమి నుంచి తేరుకున్న సౌతాఫ్రికా అద్భుత విజయాన్నందుకుంది. గురువారం న్యూ చంఢీగడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డోనవన్ ఫెర్రెయిరా(30 నాటౌట్), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/29) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ తీయలేకపోయాడు.

అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5), వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(0) వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, లుతో సిపమ్లా రెండేసి వికెట్లు తీయగా.. ఓట్నిల్ బార్ట్‌మన్(4/24) నాలుగు వికెట్లు పడగొట్టాడు.
214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపర్చాడు. అభిషేక్ శర్మ(17), సూర్యకుమార్ యాదవ్(5) కూడా వెను వెంటనే ఔటవ్వడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి భారత్ 53 పరుగులు చేసింది. ఆచితూచి ఆడిన అక్షర్ పటేల్‌ను బార్ట్ మన్ ఔట్ చేయగా.. హార్దిక్ పాండ్యా సాయంతో తిలక్ వర్మ చెలరేగాడు.
అయితే గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగించలేకపోయిన హార్దిక్ పాడ్యా(20) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. జితేష్ శర్మతో కలిసి తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. జితేశ్ శర్మ(27), శివమ్ దూబే(1), వరుణ్ చక్రవర్తీ(0) వెనుదిరిగినా ఒంటరి పోరాటం చేశాడు. కానీ దూకుడుగా ఆడే క్రమంలో ఎంగిడి బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా క్యాచ్ ఔటయ్యాడు. దాంతో భారత్ 162 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.