2023 సంవత్సరాన్ని టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(82 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 76) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీతో పాటు శుభ్‌మన్ గిల్(26) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రోహిత్ శర్మ(0), యశస్వి జైస్వాల్(5), శ్రేయస్ అయ్యర్(6), కేఎల్ రాహుల్(4), రవిచంద్రన్ అశ్విన్(0), శార్దూల్ ఠాకూర్(2), జస్‌ప్రీత్ బుమ్రా(0), మహమ్మద్ సిరాజ్(4) దారుణంగా విఫలమయ్యారు.

సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడాకు రెండు వికెట్లు దక్కాయి.
256/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. టెయిలెండర్ మార్కో జాన్సెన్(147 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 84 నాటౌట్) శతకాన్ని అందుకోలేకపోయాడు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.
ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు కుప్పకూలింది. కేఎల్ రాహుల్(101) శతకంతో చెలరేగగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జనవరి 7 నుంచి కేప్‌టౌన్ వేదికగా జరగనుంది.