IND vs SA: వన్డే క్రికెట్‌లో సౌతాఫ్రికా చెత్త రికార్డు నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. ఇక వన్డే క్రికెట్‌లో సౌతాఫ్రికాకు సొంతగడ్డపై ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం. 2018లో సఫారీ గడ్డపై ఇదే భారత జట్టుతో 118 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. తాజా మ్యాచ్‌లో 116 పరుగులకే కుప్పకూలింది.
ఓవరాల్‌గా సౌతాఫ్రికాకు ఇది పదో అత్యల్ప స్కోర్. 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 69 పరుగులకు కుప్పకూలింది. ఇదే వన్డే క్రికెట్‌లో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్(4/27) రఫ్ఫాడించడంతో 116 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బ్యాటర్లలో ఆండిలే పెహ్లుక్వాయో(49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు సౌతాఫ్రికాకు రెండో ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ రీజా హెండ్రీక్స్(0), రాసీ వాన్ డెర్ డస్సెన్(0)లను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడిన టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28)ని అర్ష్‌దీప్ సింగ్ మరుసటి ఓవర్‌లోనే పెవిలియ్ చేర్చాడు.
అనంతరం హెన్రీచ్ క్లాసెన్(6)ను కూడా అర్ష్‌దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే సౌతాఫ్రికా 52 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఆవేశ్ ఖాన్ వికెట్ల వేటను ప్రారంభించాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(12)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆవేశ్ ఖాన్.. వియాన్ ముల్దర్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. డేవిడ్ మిల్లర్(2), కేశవ్ మహరాజ్(4) క్యాచ్ ఔట్‌లుగా పెవిలియన్ చేర్చాడు.
ఆండిలో పెహ్లుక్వాయో కాస్త ఆచితూచి ఆడటంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్క్‌ను ధాటింది. అతన్ని అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఇది ఫస్ట్ ఫైవ్ వికెట్ హాల్. నండ్రె బర్గర్(7)ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.