
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్‌లోనూ భారత తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ ఓడిపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ పంత్‌కు టాస్ కలిసిరాలేదు. ఇక టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా.. మరో ఆలోచన లేకుండా మళ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచిన బవుమా ముందుగా బ్యాటింగ్ చేసి అద్భుత విజయాలందుకున్నాడు. దాంతో మరోసారి భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
తెలుగు గడ్డ సాగరతీరం విశాఖ పట్టణంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఈ మైదాన ట్రాక్ రికార్డు భారత్ జట్టులో ఆశలు రేపుతుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పుల్లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాయి. దాంతో ఉమ్రాన్ మాలిక్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
టాస్ గెలిచిన బవుమా మాట్లాడుతూ.. మళ్లీ బ్యాటింగే తీసుకుంటున్నామని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని తెలిపాడు. తమ లోపాలను సరిచేసుకోవడంపై ఫోకస్ పెట్టామన్నాడు. ఇక తాము టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని రిషభ్ పంత్ తెలిపాడు. అయితే తాము టాస్ గురించి పెద్దగా ఆలోచించడం లేదని, గుడ్ క్రికెట్ ఆడటంపై ఫోకస్ పెడతామని తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని, ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని చెప్పాడు.
తుది జట్లు:
భారత్: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్
సౌతాఫ్రికా: టెంబా బవుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డ్వేన్ ప్రిటోరియస్, రాసీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, టబ్రైజ్ షంసీ, అన్రిచ్ నోర్జ్