
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగించుకున్న టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో అక్కడ సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ముందుగా టెస్ట్ సిరీస్ జరగనుండగా.. ఇరు జట్ల మధ్య ఈ నెల 26న తొలి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్‌తో తలపడే జట్టును క్రికెట్ సౌతాఫ్రికా(సీఏ) మంగళవారం ప్రకటించింది. 21 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఈ సిరీస్‌లో డీన్ ఎల్గర్ సఫారీ టీమ్‌ను నడిపించనుండగా.. క్వింటన్ డికాక్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇక ఈ సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.. రెండు కొత్తముఖాలను ఎంపిక చేసింది. సిసండా మగల, ర్యాన్ రికెల్టన్ తొలిసారి జాతీయ జట్టు పిలుపును అందుకున్నారు. ఇక వెస్టిండీస్ పర్యటనకు ఎంపికైన మరో యువ ఆటగాడు సర్లే ఎర్వీని కూడా కొనసాగించింది.
ఇక డీన్ ఎల్గర్, ఎయిడెన్ మార్క్‌రమ్, క్వింటన్ డికాక్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ముఖ్యంగా డికాక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్ పర్యటనలో 96, 141 నాటౌట్‌తో రాణించాడు. కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడిల పేస్ త్రయానికి తోడు కేశవ్ మహరాజ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. వియాన్ ముల్దర్, జార్జ్ లిండేలతో బౌలింగ్ బెంచ్ కూడా పటిష్టంగానే ఉంది.
సౌతాఫ్రికా జట్టు : డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బవుమా, క్వింటన్ డికాక్, కగిసో రబడా, సరెల్ ఎర్వీ, బ్యూరాన్ హెండ్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మాహారాజ్, లుంగీ ఎంగిడి, మర్క్రమ్, వాయీన్ ముల్దర్, ఎన్రిచో నోర్జ్డే, కీగన్ పీటర్సన్, రస్సీ వాండర్ డసెన్, కైల్ వెర్రియన్నే, మార్కో జాన్సన్, గ్లెంటన్ స్టుర్మన్, ప్రినెలన్ సుబ్రయెన్, సిసండ మగాలా, ర్యాన్ రికెల్టన్, డ్యూనే ఒలివర్
టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్లో మార్పు చేశారు. ఇంతకుముందు ప్రకారం డిసెంబరు 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో టీమిండియా పర్యటన కాస్త ఆలస్యమయింది. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ముందుగా అనుకున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వాయిదా వేసారు.