
గౌహతి: భారత్ X సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టీ20లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూహ్యంగా మైదానంలోకి పాము రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. మైదానంలో పామును చూసిన ఆటగాళ్లు భయాందోళనకు లోనవ్వగా.. అంపైర్లు ఆటను నిలిపేసారు. మైదాన సిబ్బంది పామును బయటకు పంపించడంతో ఆట మళ్లీ మొదలైంది. ఇక మైదానంలో పాము రావడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పాముకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వేల మంది హాజరైన మ్యాచ్‌కు పాము ఎలా వచ్చిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ మైదానానికి చెందినదే అయ్యుంటుందని, జనాలు అరుపులకు భయపడి మైదానంలోకి వచ్చినట్లుందని అభిప్రాయపడుతున్నారు.
ముందే చూసారు కాబట్టి మంచిదైందని, లేకుంటే ఏ ప్లేయర్‌నైనా కరిస్తే పరిస్థితి దారుణంగా ఉండేదని, పెను ప్రమాదం తప్పిందని కొందరంటున్నారు. అయితే అది విషసర్పమా? సాధారణ పామేనా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. పాము మైదానంలోకి వచ్చి.. ఆటగాళ్లతో పాటు టీవీ ప్రేక్షకులను కలవరపాటుకు గురి చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా అద్భుతమైన శుభారంభం అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43), కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) దంచికొట్టడంతో తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం లభించింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్పిన్నర్ కేశవ్ మహరాజ్ విడదీసాడు. హాఫ్ సెంచరీ ముంగిట రోహిత్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో రాహుల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మహరాజ్ అతన్ని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. తనదైన షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.