IND vs SA: ఇండియా బీ టీమ్‌తో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా .. గబ్బర్ సేనదే సిరీస్!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన కీలక ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో హోరాహోరీ తప్పదని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత బౌలర్ల అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ పూర్తిగా ఏక పక్షంగా సాగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకు కుప్పకూలింది.
జెన్నెమన్ మలాన్(15), హెన్రీచ్ క్లాసెన్(34), మార్కో జాన్సెన్(14)లు మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/18) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. మహమ్మద్ సిరాజ్(2/17), వాషింగ్టన్ సుందర్(2/15), షెహ్‌బాజ్ అహ్మద్(2/7) రెండేసి వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. అంతర్జాతీయ వన్డేల్లో సౌతాఫ్రికాకు ఇది నాలుగో లోయెస్ట్ స్కోర్ కావడం గమనార్హం.

ఆడుతూ పాడుతూ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ ఆడుతూ పాడుతూ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 105 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(57 బంతుల్లో 8 ఫోర్లతో 49), శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) రాణించారు. శిఖర్ ధావన్(8), ఇషాన్ కిషన్(10) ఆకట్టుకోలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, ఫర్చ్యూన్ చెరో వికెట్ తీసారు.

ధావన్ విఫలమైనా..
100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ డిఫెన్స్‌కు పరిమితమైనా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఓవర్‌కు ఓ బౌండరీ బాదాడు. పూర్తిగా తానే స్ట్రైకింగ్ తీసుకొని సఫారీ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. అయితే ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ధావన్ అలసత్వంతో రనౌటయ్యాడు. లేని పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 42 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి ఇషాన్ కిషన్ రాగా.. పరుగులు వేగం తగ్గింది. బౌండరీలతో జోరు కనబర్చిన అతను.. ఫర్చ్యూన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.

బచాయించిన అయ్యర్..
క్రీజులోకి వచ్చిన సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్‌కు సఫారీ బౌలర్లు షాట్ బాల్స్‌తో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. లక్కీగా అయ్యర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నోర్జ్ వేసిన 12వ ఓవర్ మూడో బంతిని అయ్యర్ పుల్ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద మార్కో జాన్సెన్ అద్భుతంగా అందుకున్నాడు. కానీ సమన్వయం కోల్పోయిన అతను గాల్లోకి విసిరి మళ్లీ అందుకునే ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఇక థర్డ్ అంపైర్ పలు యాంగిల్స్‌లో రిప్లేలను పరిశీలించి సిక్సర్‌గా ప్రకటించాడు. దాంతో అయ్యర్ ఊపిరి పీల్చుకున్నాడు.

విన్నింగ్ సిక్సర్‌తో..
ఆ తర్వాత వేగం పెంచిన అయ్యర్.. బౌండరీలు బాదాడు. మరోవైపు గిల్ సైతం బౌండరీలు బాదడంతో భారత స్కోర్ బోర్డు వేగంగా కదిలింది. అయితే 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఎల్బీగా వెనుదిరిగి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. క్రీజులోకి సంజూ శాంసన్(2) రాగా.. శ్రేయస్ అయ్యర్ సిక్సర్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications