సౌతాఫ్రికాతో చివరి టీ20లోనూ భారత బ్యాటర్లు దుమ్మురేపారు. వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ సంజూ శాంసన్(56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 109 నాటౌట్), తెలుగు తేజం తిలక్ వర్మ(47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 నాటౌట్) విధ్వంసకర శతకాలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవరల్లో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) దూకుడుగా ఆడాడు.
భారత బ్యాటర్ల ధాటికి సౌతాఫ్రికా బౌలర్లు పోటాపోటీగా పరుగులిచ్చుకున్నారు. లుతో సిపమ్లా ఒక్క వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. విదేశీ గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక టీ20 స్కోర్.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో వేగంగా పరుగులు వచ్చాయి. పవర్ ప్లేలో చివరి బంతికి అభిషేక్ శర్మ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడంతో తొలి వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. సంజూ శాంసన్ తన జోరును కొనసాగించాడు. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 10వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది 28 బంతుల్లో సంజూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో సంజూ కొట్టిన ఓ సిక్సర్‌కు లేడీ ఫ్యాన్ దవడ పగలడం విశేషం. సంజూకు తగ్గట్లుగానే తిలక్ వర్మ కూడా వరుస బౌండరీలతో చెలరేగాడు.
కొంపముంచిన చెత్త ఫీల్డింగ్..
మార్క్‌రమ్ వేసిన 14వ ఓవర్‌లో బౌండరీ బాది 21 బంతుల్లోనే తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి విధ్వంసంతో టీమిండియా 14.1 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్‌ను చేరుకుంది. గెరాల్డ్ కోయిట్జీ వేసిన 15వ ఓవర్‌లో సంజూ, తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్‌లను సఫారీ ఫీల్డర్లు వదిలేసారు. మార్కో జాన్సెన్ వేసిన మరుసటి ఓవర్‌లో సంజూకు మరో లైఫ్ లభించింది. అతను ఇచ్చిన కఠినమైన రిటర్న్ క్యాచ్‌ను జాన్సెన్ అందుకోలేకపోయాడు.
కోయిట్జీ బౌలింగ్‌లో తిలక్‌కు మరో లైఫ్ లభించింది. సునాయస క్యాచ్‌ను జాన్సెన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో చెలరేగిన ఈ జోడీ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. అదే ఓవర్‌లో సంజూ బౌండరీతో పాటు సింగిల్ తీసి 51 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆమరుసటి ఓవర్‌లో తిలక్ వర్మ 41 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. అతనికి వరుసగా ఇది రెండో టీ20 సెంచరీ. అనంతరం ఈ ఇద్దరూ పోటాపడి సిక్సర్లు బాది జట్టుకు భారీ స్కోర్ అందించారు.