
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక మూడో టీ20లో టీమిండియా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), ఇషాన్ కిషన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) అదరగొట్టారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఈ యువ ఓపెనర్లు.. అసలు సిసలు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని ఇతర బ్యాటర్లు అందిపుచ్చుకోకపోవడంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న భారత్ సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. డ్వేన్ ప్రిటోరియస్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా, టబ్రైజ్ షంసీ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.
ఆరంభం నుంచి రుతురాజ్, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అన్రిచ్ నోర్జ్ వేసిన ఐదో ఓవర్‌లో గైక్వాడ్ వరుసగా 5 బౌండరీలు బాదాడు. షంసీ వేసిన 9వ ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ వెంటనే అతన్ని కేశవ్ మహరాజ్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. తొలి వికెట్‌కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్ సిక్సర్‌తో దూకుడు కనబర్చగా.. ఇషాన్ తనదైన శైలిలో 4, 6, 4 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అయ్యర్(14)ను షంసీ పెవిలియన్ చేర్చగా.. ప్రిటోరియస్.. ఇషాన్‌ను ఔట్ చేశాడు. దాంతో భారత్ జోరుకు బ్రేక్ పడింది. కెప్టెన్ రిషభ్ పంత్‌తో పాటు హార్దిక్ పాండ్యా పరుగులు చేసేందుకు తడబడ్డారు. పంత్‌కు లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో భారత్ 33 బంతులపాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. చివర్లో హార్దిక్ ధాటిగా ఆడటంతో భారత్ పోరాడే లక్ష్యాన్ని ఉంచింది.