
గౌహతి: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు సహకరించే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సఫారీ కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. తేమ ప్రభావం కూడా ఉండనుందని, ఛేజింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నాడు. ఈ విభిన్నమైన పిచ్‌పై బాల్‌తో సత్తా చాటి ఆ తర్వాత బ్యాటింగ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేస్తామని బవుమా ధీమా వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్‌లో ఓడినా.. తమకు కొన్ని సానుకూలంశాలు లభించాయని చెప్పిన బవుమా.. ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. షంసీకి బదులు ఎంగిడిని జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకోవాలనే టీమ్ వ్యూహంలో భాగంగానే ఈ మార్పు చేశామని చెప్పాడు.
మరోవైపు భారత జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని రోహిత్ తెలిపాడు. అయితే ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పిన హిట్‌మ్యాన్.. గుడ్ క్రికెట్ ఆడి.. ప్రేక్షకులను అలరిస్తామని తెలిపాడు. 'ఇప్పటి వరకు సఫారీ జట్టును ఇక్కడ ఓడించలేదు. ఇది ఓ మంచి అవకాశంగా భావిస్తున్నాం. ప్రతీ ఒక్కరు ఈ మ్యాచ్ కోసం సిద్దమయ్యారు. కండిషన్స్‌పై క్లారిటీ లేకున్నా..బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరంభంలో మేం కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. మాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. టార్గెట్‌ను కాపాడుకోవడం మాకు బిగ్ చాలెంజ్. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
బుమ్రా గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన సిరాజ్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ విన్నింగ్ టీమ్‌నే కొనసాగించింది. ఈ మ్యాచ్ గెలిచి మూడో మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని పరీక్షిస్తామని రోహిత్ తెలిపాడు. ఆ క్రమంలోనే విన్నింగ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.
తుది జట్లు
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్(కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రిలీ రాసౌ, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వైన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడి