టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో శుభారంభం అందించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆ జట్టు ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే సౌతాఫ్రికాకు షాకిచ్చాడు. ఈ ఓవర్ ఐదో బంతిని సిరాజ్ గుడ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ చేతిలో పడింది. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడం చూసి మార్క్‌రమ్(5) బిత్తరపోయాడు. దాంతో సౌతాఫ్రికా 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

క్రీజులోకి టోడీ డీ జోర్జీ, డీన్ ఎల్గర్ నిలకడగా ఆడుతూ.. మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. దాంతో సౌతాఫ్రికా 49/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
అంతకుముందు 208/8 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. కేఎల్ రాహుల్(137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) మెరుపు శతకం పూర్తయిన తర్వాత 245 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజతో 9వ వికెట్‌కు 47 పరుగులు జోడించిన రాహుల్.. చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. వేగంగా పరుగులు చేసిన రాహుల్.. సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
భారత బ్యాటర్లలో రాహుల్ తర్వాత విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలోకగిసో రబడా(5/59), నండ్రే బర్గర్(3/50)కు తోడుగా మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ పడగొట్టాడు.