సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. టీ20 సిరీస్ ముగించుకొని వన్డే సిరీస్‌కు సన్నదమవుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి సిరీస్‌ను పంచుకున్నాయి. జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. తండ్రి అనారోగ్యంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న దీపక్ చాహర్.. వన్డే సిరీస్ కూడా ఆడటం లేదని ప్రకటించింది. అతని స్థానంలో ఆకాశ్ దీప్‌తో భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది.

చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కూడా దూరంగా ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. టెస్ట్ సిరీస్‌కు సన్నదమయ్యే క్రమంలో అతని వన్డే టీమ్‌ను వీడుతాడని పేర్కొంది. ఈ సిరీస్‌లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. ఇక దీపక్ చాహర్ స్థానంలో ఎంపికైనఆకాశ్ దీప్.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున ఆడుతున్న అతను మూడు ఫార్మాట్లలో కలిపి 80 మ్యాచ్‌లు ఆడి 70కి పైగా వికెట్లు తీసాడు.
ఇక ఈ వన్డే సిరీస్‌కు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అందుబాటులో ఉండటం లేదు. వన్డే సిరీస్ అనంతరం సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రిపరేషన్స్‌పై ద్రవిడ్ అండ్ కో ఫోకస్ పెట్టనుంది. దీంతో వన్డే సిరీస్‌లో ఇండియా ఏ కోచింగ్ భారత జట్టుకు సహాయం చేయనుంది.
డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు మహమ్మద్ షమీ దూరమయ్యాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకోలేదని, ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైతే షమీ.. సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కుతాడని బీసీసీఐ తెలిపింది.