
పార్ల్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక పూర్తి స్థాయి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో తాత్కలిక సారథి కేఎల్ రాహుల్ టీమిండియాను నడిపిస్తున్నాడు. ఇక ఐపీఎల్ స్టార్ వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్.. ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. యుజ్వేంద్ర చాహల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కింది. చాలా రోజుల తర్వాత అశ్విన్ మళ్లీ వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. ఊహించినట్లుగానే ఓపెనర్‌గా శిఖర్ ధావన్‌కు చోటు దక్కగా.. మిడిలార్డర్‌లో మాత్రం సూర్యకుమార్ యాదవ్‌కు బదులు శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చారు.
టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌లో ఎట్టకేలకు దానికి ముగింపు పలికింది. టాస్ గెలిచిన టెంబా బవుమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా కనిపిస్తుందని, బ్యాటింగ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పాడు. అలాగే తమ బౌలర్లకు కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాని తెలిపాడు.
టాస్ ఓడిన కేఎల్ రాహుల్ సైతం బ్యాటింగ్ చేయాలనుకున్నట్లు తెలిపాడు. జట్టుగా ఈ సవాల్ స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామని, రెండు ఇన్నింగ్స్‌ల్లో సత్తా చాటుతామని తెలిపాడు. తమకు నాణ్యమైన స్పిన్నర్లున్నారని ధీమా వ్యక్తం చేశాడు. బుమ్రా, భువీ ఆరంభంలో వికెట్లు తీసి శుభారంభం అందిస్తే.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చన్నాడు. వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేస్తున్నాడని, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగుతాడని తెలిపాడు.
తుది జట్లు:
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్(కీపర్), జన్నెమన్ మలాన్, ఎయిడెన్ మార్క్‌రమ్, రాసీ వాన్ డెర్ డస్సెన్, టెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అండిలె పెహ్లుక్వాయో, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షంసీ, లుంగి ఎంగిడి
భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.