IND vs SA: సెంచరీతో చెలరేగిన రాహుల్.. చేతులెత్తేసిన సఫారీ బౌలర్లు! తొలి రోజు భారత్‌దే!

సెంచూరియన్: టెస్ట్ సిరీస్ గెలవడమే లక్ష్యంగా సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత్.. తమ తొలి అడుగునే బలంగా వేసింది. సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్(248 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 122 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లకు 272 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌తో పాటు అజింక్యా రహానే(81 బంతుల్లో 8 ఫోర్లతో 40 బ్యాటింగ్) ఉన్నారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 4 ఫోర్లతో 35) పర్వాలేదనిపించాడు. చతేశ్వర్ పుజారా(0) ఒక్కడే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు.

శుభారంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన భారత ఓపెనింగ్ ద్వయం.. సౌతాఫ్రికా బౌలర్లను గౌరవిస్తూనే వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు ఎక్స్‌ట్రా బౌన్స్‌కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడింది. 18 బంతుల తర్వాతగానీ కేఎల్ రాహుల్ పరుగుల ఖాతా తెరవలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఓవైపు కేఎల్ రాహుల్ డిఫెన్స్‌కు పరిమితమైనా మయాంక్ అగర్వాల్ మత్రం బౌండరీలతో జోరు కనబర్చాడు. 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాన్సెన్ బౌలింగ్‌లో మయాంక్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ క్వింటన్ డికాక్ వదిలేసాడు. ఈ అవకాశాన్ని అందుకున్న అగర్వాల్ మరింత జోరు కనబర్చాడు. దాంతో భారత్ 83/0 స్కోర్‌కు లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

మయాంక్ హాఫ్ సెంచరీ..
లంచ్ బ్రేక్ అనంతరం మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ జోరు పెంచాడు. అయితే క్రీజులో కుదురుకున్న ఈ జోడీని లుంగి ఎంగిడీ విడదీసాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న మయాంక్ అగర్వాల్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అంపైర్ నాటౌటివ్వగా.. రివ్యూ తీసుకొని మరీ సౌతాఫ్రికా ఫలితం సాధించింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా మరుసటి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి వేసిన ఇన్ స్వింగ్ డెలివరీని అంచనా వేయడంలో పుజారా విఫలమవ్వడంతో.. ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కైగన్ పీటర్సన్ ఏ తప్పు చేయకుండా ఆ బంతిని అందుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీతో రాహుల్ మరో వికెట్ పడకుండా రెండో సెషన్ ముగించాడు. దాంతో భారత్ 157/2 స్కోర్ టీ బ్రేక్‌కు వెళ్లింది.

రాహుల్ సెంచరీ..
ఇక మూడో సెషన్‌లో కూడా రాహుల్, కోహ్లీ నిలకడగా ఆడారు. సెంచరీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని మరోసారి లుంగి ఎంగిడే విడదీసాడు. విరాట్ కోహ్లీ బలహీనతపై దెబ్బకొడుతూ ఫలితం రాబట్టాడు. ఊరించే ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే తనదైన శైలిలో ఆడాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ.. రాహుల్‌పై ఒత్తిడి లేకుండా చూసుకున్నాడు. ఇక రాహుల్ సైతం బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications