IND vs SA: సౌతాఫ్రికా పర్యటనలో తాత్కలిక వన్డే సారథిగా టీమిండియాను నడిపిస్తున్న కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ విజయం ద్వారా కేఎల్ రాహుల్ నయా చరిత్రను లిఖించాడు. సౌతాఫ్రికాలో పింక్ వన్డే గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.
గతంలో ఏ భారత కెప్టెన్ కూడా సౌతాఫ్రికాతో పింక్ వన్డే గెలవలేదు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనను పెంచేందుకు ప్రతీ ఏడాది క్రికెట్ సౌతాఫ్రికా పింక్ వన్డే నిర్వహిస్తోంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లంతా పింక్ జెర్సీలు ధరించి బరిలోకి దిగుతారు. అందుకే ఈ మ్యాచ్‌లను పింక్ వన్డేలుగా పిలుస్తారు.

ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన ఆదాయంలోని కొత్త భాగాన్ని రొమ్ము క్యాన్సర్ బాధితుల కోసం క్రికెట్ సౌతాఫ్రికా ఖర్చు చేస్తోంది. 2013 నుంచి ఈ ఛారిటీ మ్యాచ్‌ను సౌతాఫ్రికా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 12 పింక్ వన్డేలు జరగ్గా.. సౌతాఫ్రికా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్(2019), ఇంగ్లండ్(2020), భారత్(2023) ఉన్నాయి. 2015లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం నమోదు చేసి ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. ఫారీ బ్యాటర్లలో ఆండిలే పెహ్లుక్వాయో(49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 117 పరుగులు చేసి 200 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్(5) విఫలమైనా.. అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(43 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్, ఆండిలో పెహ్లుక్వాయో తలో వికెట్ తీసారు.