IND vs SA: కేఎల్ రాహుల్ X డీన్ ఎల్గర్ మధ్య గొడవ.. ఔటైన అసహనంలో నోరుజారిన భారత కెప్టెన్!

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ సహనం కోల్పోయాడు. 27 పరుగుల లోటుతో రెండో రోజు ఆట చివరి సెషన్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. అయితే ఈ వికెట్ వ్యవహారం చర్చనీయాంశమైంది. రాహుల్ ఔట్ విషయంలో అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అంపైర్ తప్పిదం కారణంగా రాహుల్ వెనుదిరిగాల్సి వచ్చిందని కొందరంటే.. సరైన నిర్ణయమేనని మరికొందరు అంటున్నారు. ఇక రాహుల్ మాత్రం అంపైర్ నిర్ణయం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అసలేం జరిగిందంటే..
భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా మార్కో జాన్సెన్ వేసిన 7వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని జాన్సెన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌గా వేయగా రాహుల్ షాట్ కోసం వెంటాడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌లోకి దూసెకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఎయిడెన్ మర్‌క్రమ్ ముందుకు డైవ్ చేస్తూ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. కానీ.. మర్‌క్రమ్ క్యాచ్ పట్టడంపై సందేహం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్.. తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌కి నివేదించాడు. ఈ క్రమంలో తన వైపు నుంచి సాప్ట్ సిగ్నల్‌గా ఔటిచ్చాడు.
ఔటివ్వడంతో..
టీవీ రిప్లేలను పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. మర్‌క్రమ్ క్యాచ్ అందుకునే సమయంలో బంతి నేలని తాకలేదని తేల్చాడు. అయితే.. రిప్లైలో కనిపించిన కొన్ని యాంగిల్స్‌లో మాత్రం బంతి మర్‌క్రమ్ చేతుల ముందు బౌన్స్ అయినట్లు కనిపించింది. దాంతో.. రాహుల్ తాను నాటౌట్ అనే ధీమాతో కనిపించాడు. కానీ.. చివరికి థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో.. సహనం కోల్పోయాడు. పెవిలియన్‌కి వెళ్తూ దక్షిణాఫ్రికా టీమ్ , ఫీల్డ్ అంపైర్ల వైపు కోపంగా చూస్తూ తిట్టుకుంటూ వెళ్లాడు. అతని మాటలకు మార్క్‌రమ్ సైతం బదులివ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
రాహుల్‌పై చర్యలు..
అయితే అంపైర్ నిర్ణయంపై అలా ప్లేయర్ అసంతృప్తి వ్యక్తం చేయడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకి వస్తుంది. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ల నుంచి ఫిర్యాదు వెళ్తే? రాహుల్‌కి జరిమానా పడే అవకాశం ఉంది. మ్యాచ్ రిఫరీ రాహుల్‌ను మందలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకునే చాన్స్ ఉంది. ఇక సౌతాఫ్రికా జట్టులో డసెస్ ఔట్ విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే నెలకొంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు కనిపించింది. కానీ మరో కోణంలో స్పష్టమైన క్యాచ్‌గా తేలింది. దాంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.
చెలరేగిన శార్దూల్..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతూ 20 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మయాంక్ (23), రాహుల్ (8) అవుట్ కాగా... పుజారా (35 బ్యాటింగ్; 7 ఫోర్లు), రహానే (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన 27 పరుగులు పోగా, ప్రస్తుతం భారత్‌కు 58 పరుగుల ఆధిక్యం ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 35/1తో ఆట మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది.
ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పీటర్సన్ (118 బంతుల్లో 62; 9 ఫోర్లు), తెంబా బవుమా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్ (7/61) చిరస్మరణీయ బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications