
జొహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా.. ప్రత్యర్థి బౌలర్ కవ్వింపులకు సహనం కోల్పోయాడు. నీ అవ్వ తగ్గేదేలే అంటూ మాటకు మాట జవాబిస్తూ అతనిపై దూసుకెళ్లాడు. భారత సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా యంగ్ పేసర్ మార్కో జాన్సెన్‌తో బుమ్రా గొడవపడ్డాడు.
పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రాకి జాన్సన్ వరుసగా షార్ట్ పిచ్ బంతుల్ని సంధించాడు. ఈ క్రమంలో ఓ బంతి బుమ్రా భుజానికి బలంగా తాకింది. దాంతో.. జాన్సన్ బుమ్రాను వెక్కిరిస్తూ నోరుపారేసుకున్నాడు. ఇక బంతి తగిలిన నొప్పిని పంటి బిగువన భరించిన బుమ్రా జాన్సన్ వైపు చూస్తూ జస్ట్ భుజంపై దుమ్ముని దులుపుకున్నాడు.
బుమ్రా అలా చేయడంతో జాన్సన్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత బంతిని కూడా షార్ట్ పిచ్ రూపంలో విసిరాడు. అయితే దాన్ని ఫుల్ షాట్ ఆడబోయిన బుమ్రా మరోసారి విఫలమయ్యాడు. దాంతో.. జాన్సన్ మరోసారి నోరు జారాడు. ఇక ఈసారి సహనం కోల్పోయిన బుమ్రా.. యువ పేసర్‌కు తన విశ్వరూపం చూపించాడు. మాటకి మాట బదులిస్తూ నీ అవ్వ తగ్గేదేలే అంటూ క్రీజు నుంచి ముందుకు వచ్చాడు. మరోవైపు జాన్సన్ కూడా అదే రీతిలో గట్టిగా అరుస్తూ పిచ్ మధ్యలోకి వచ్చాడు. పిచ్ మధ్యలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం పెరగడంతో.. ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ కలగజేసుకుని సర్దిచెప్పాడు.
మ్యాచ్ ఇన్నింగ్స్ 54వ ఓవర్‌లో ఈ గొడవ జరగగా.. ఆ ఓవర్‌లో వరుసగా గంటకి 137కిమీ వేగంతో రెండు షార్ట్ పిచ్ బంతుల్ని సంధించిన జాన్సన్.. మాటల యుద్ధం తర్వాత గంటకి 143కిమీ వేగంతో బౌన్సర్ విసరడం గమనార్హం. అయినప్పటికీ.. బుమ్రా వెనక్కి తగ్గకుండా బంతిని హిట్టింగ్ చేసేందుకే ప్రయత్నించాడు. కానీ.. ఆ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా బుమ్రా రాబట్టలేకపోయాడు. అయితే.. తర్వాత ఓవర్‌లో రబాడా బౌలింగ్ సిక్స్ బాదిన బుమ్రా.. అనంతరం ఎంగిడి బౌలింగ్‌లో జాన్సన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
85/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. 60.1 ఓవర్లలో 266 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 27 పరుగుల లోటు తీసేయగా సౌతాఫ్రికా ముందు 240 పరుగుల పోరాడే లక్ష్యం నమోదైంది. భారత ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా(86 బంతుల్లో 10 ఫోర్లతో 53), అజింక్యా రహానే(78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. తెలుగు క్రికెటర్ హనుమ విహారి(84 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) అజేయంగా నిలిచాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్(24 బంతుల్లో 5 ఫోర్లతో 28) విలువైన పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ మూడేసి వికెట్లు పడగొట్టారు.