టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న రెండో భారత పేసర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బుమ్రా.. ఓవరాల్‌గా సేనా దేశాల్లో 6 సార్లు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ రికార్డును బుమ్రా సమం చేశాడు. సేనా దేశాల్లో జహీర్ ఖాన్ సైతం ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

కపిల్ దేవ్ సేనా దేశాల్లో ఏడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా... కపిల్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. సౌతాఫ్రికా గడ్డపై బుమ్రాకు ఇది మూడో ఐదు వికెట్ల ఘనత కాగా.. ఇంగ్లండ్ గడ్డపై రెండు సార్లు, వెస్టిండీస్ గడ్డపై రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియాలో మాత్రం ఒక్కసారే ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. సొంతగడ్డపై కూడా బుమ్రా ఒకేసారి ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు.
తొలి రోజు ఆటలోనే ట్రిస్టన్ స్టబ్స్(1)ను క్యాచ్ ఔట్ చేసిన బుమ్రా.. రెండో రోజు ఆటలో ఆ జట్టు నడ్డి విరిచాడు. డేవిడ్ బెడ్డింగ్‌హమ్(11), కైల్ వెర్రెయన్నే(9), మార్కో జాన్సెన్(11), కేశవ్ మహరాజ్(3)లను పెవిలియన్ చేర్చాడు. మార్కో జాన్సెన్‌ను అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. కేశవ్ మహరాజ్ వికెట్‌తో బుమ్రా ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు.
బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(84 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా.. బుమ్రా, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లతో రాణించారు.
అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు కుప్పకూలింది. ఒక్క పరుగు జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ(46), శుభ్‌మన్ గిల్(36), రోహిత్ శర్మ(39) పర్వాలేదనిపించారు.