
కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని, చూడటానికి చాలా స్లోగా ఉండేలా కనిపిస్తుందని టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన పరాభావాన్ని మరిచి విజయం కోసం ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నామన్నాడు. పకడ్బందీ ప్రణాళికలతో వస్తున్నామని చెప్పాడు. ఇక జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయని, సూర్యకుమార్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, జయంత్ యాదవ్, దీపక్ చాహర్ జట్టులోకి వచ్చారని చెప్పాడు. ఇక శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్‌లకు ఉద్వాసన పలికామని రాహుల్ చెప్పుకొచ్చాడు.
తమ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా షంసీ స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. సిరీస్ గెలిచాం కదా? అని ఈ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోమని, విజయం కోసం సాయశక్తులా కృషిచేస్తామని తెలిపాడు. పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు చేసి 300 ప్లస్ టార్గెట్ ఉంచేందుకు ప్రయత్నిస్తామని బవుమా తెలిపాడు.
ఇప్పటికే 0-2తో సిరీస్ కోల్పోయిన భారత్ చివరిదైన ఈ మూడో మ్యాచ్‌లోనైనా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఒక విజయాన్ని నమోదు చేస్తుందా లేక ఓటమితో టూర్‌ను ముగిస్తుందా అనేది చూడాలి.
రెండు వన్డేల్లోనూ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఏమాత్రం ఆకట్టుకోకపోగా...హెడ్ కోచ్‌గా ప్రధాన ఆటగాళ్లతో తొలి పర్యటనలోనే రాహుల్ ద్రవిడ్‌కు కూడా సంతృప్తికర ఫలితం దక్కలేదు.
తుది జట్లు:
సౌతాఫ్రికా: జెన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్, టెంబా బవుమా(కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్, రాసీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, అండిలే పెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, డ్వేన్ ప్రిటోరియస్, లుంగి ఎంగిడి, సిసాండ మగల
భారత్: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్