
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. తెలుగు గడ్డ వైజాగ్ తీరం ఎట్టకేలకు టీమిండియాను విజయతీరానికి చేర్చింది. మంగళవారం జరిగిన కీలక మూడో టీ20లో భారత్ సమష్టిగా రాణించి 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది.
ఫలితంగా ఐదు టీ20ల సిరీస్‌లో 1-2తో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), ఇషాన్ కిషన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా, టబ్రైజ్ షంసీ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సఫారీ టీమ్.. 19.1 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది. హెన్రీచ్ క్లాసెన్(29), రీజా హెన్రీక్స్(23) టాప్ స్కోర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్(4/25) నాలుగు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్(3/20) మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్‌లకు తలో వికెట్ దక్కింది.
180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే అక్షర్ పటేల్.. సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(8)ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ రీజా హెన్రీక్స్(23)ను హర్షల్ పటేల్ క్యాచ్ ఔట్‌గా వెనక్కిపంపాడు. దాంతో సఫారీ టీమ్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.
ఆ కొద్ది సేపటికే డస్సెన్(1), డ్వేన్ ప్రిటోరియస్(20)లను తన వరుస ఓవర్లలో చాహల్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సఫారీ పీకల్లో కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చి డేంజరస్ డేవిడ్ మిల్లర్(3)ను హర్షల్ పటేల్ బోల్తా కొట్టించాడు. కిల్లర్ లాంటి మిల్లర్ ఔటవ్వడంతో భారత ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాతా కగిసో రబడా(9)ను కూడా హర్షల్ ఔట్ చేయడంతో సఫారీ ఓటమి ఖారారైంది.