IND vs SA: భారీ స్కోర్‌తో బతికిపోయిన టీమిండియా.. సిరీస్ గెలిచినా వణికించిన మిల్లర్!

గౌహతి: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. దాంతో సొంతగడ్డపై సౌతాఫ్రికా మీద టీ20 సిరీస్ గెలిచిన జట్టుగా రోహిత్ సేన చరిత్రకెక్కింది. ఆదివారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో గెలిచింది. బౌండరీ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది.
సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. పోటీపడి మరీ పరుగిలిచ్చారు.

వణికించిన మిల్లర్, డికాక్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులే చేసింది. డేవిడ్ మిల్లర్(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్‌కు విజయానందమే లేకుండా చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసినా... 62 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. దీపక్ చాహర్(0/24) మినహా అంతా ధారళంగా పరుగులిచ్చారు. మూడో టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుంది.

ఆరంభంలోనే ఎదురుదెబ్బ..
238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లోనే ఓపెనర్ టెంబా బవుమా(0), రిలీ రస్సౌ(0) బంతి వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రమ్‌తో క్వింటన్ డికాక్ ఆచితూచి ఆడాడు. మార్క్‌రమ్ మాత్రం తనదైన శైలిలో ఎదురుదాడికి దిగాడు.
మార్క్‌రమ్ ఓవర్‌కు ఓ బౌండరీ బాదడంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా రెండు వికెట్లకు 45 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే బంతిని అందుకున్న అక్షర్ పటేల్.. మార్క్‌రమ్(33)ను ఔట్ చేసి 46 పరుగుల స్వల్ప భాగస్వామ్యానికి తెరదించాడు.

మిల్లర్ కిల్లర్..
దాంతో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, డికాక్ ఆచితూచి ఆడారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్న ఈ ఇద్దరూ ఆ తర్వాత తమ విశ్వరూపం చూపించారు. అశ్విన్ వేసిన 12వ ఓవర్‌లో మిల్లర్ రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాదాడు. అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్‌లో డికాక్ 6, 6, 4 బాది బౌలర్లను భయపెట్టాడు.
17వ ఓవర్‌ను దీపక్ చాహర్ కాస్త కట్టడిగా బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. 18వ ఓవర్‌లో హర్షల్ పటేల్ 11 పరుగులే ఇవ్వడంతో భారత విజయం ఖాయామైంది. ఇక 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 26 పరుగులు సమర్పించుకున్నాడు.
దాంతో సౌతాఫ్రికా విజయానికి చివరి 6 బంతుల్లో 37 పరుగులు అవసరమయ్యాయి. అక్షర్ పటేల్ 20 పరుగులే ఇవ్వడంతో టీమిండియా విజయం లాంఛనమైంది. ఇదే ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన మిల్లర్ కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications