
న్యూఢిల్లీ: బ్యాటింగ్ వైఫల్యంతోనే భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిపోయామని సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గర్ అన్నాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడంలో తమ బ్యాట్స్‌మన్ తడబడ్డారని తెలిపాడు. తొలి రోజు ఆటలో విఫలమైనా.. తర్వాత బౌలర్లు అద్భుతంగా చెలరేగారని చెప్పుకొచ్చాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 113 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో సౌతాఫ్రికా కోటలను బద్దలు చేసిన కోహ్లీసేన.. సెంచూరియన్ వేదికగా టెస్ట్ విజయం అందుకున్న తొలి ఆసియా జట్టుగా రికార్డుకెక్కింది. అంతేకాకుండా మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచి మూడు దశాబ్దాల కలకు అడుగు దూరంలో నిలిచింది.
ఇక మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంప ముంచిందన్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లో తప్పిదాలను సరిదిద్దుకొని కమ్ బ్యాక్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'తొలి టెస్ట్ ఓడిపోవడం బాధాకరం. మేం కొన్ని తప్పులు చేశాం. అయితే, కొన్ని సానుకూల అంశాలు కూడా బయటికి వచ్చాయి. రాబోయే రెండు టెస్టుల్లో మేం వాటిని ఉపయోగించుకోవాలి. భారత ఓపెనర్లు రాణించారు. తొలుత మా బౌలర్లు సరైన లెంగ్త్‌లో బంతులు వేయలేదు. కొన్నిసార్లు చర్చించిన తర్వాత బౌలింగ్‌లో మార్పు కనిపించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశాం. 20 వికెట్లు తీయడానికి మా బౌలర్లు పడిన కష్టాన్ని చెప్పలేం. మా బ్యాటర్లు నిరాశపరిచారు. రెండు జట్ల మధ్య బ్యాటింగ్‌లో తేడా ఉంది. ఈ విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్‌తో చర్చించాలి' అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు.
305 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. 191 పరుగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో కెప్టెన్ డీన్ ఎల్గర్(77), టెంబా బవుమా(35 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (3/50), మహమ్మద్ షమీ(3/63) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/47), రవిచంద్రన్ అశ్విన్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. సూపర్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జనవరి 3 నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనుంది.