IND vs SA: ‘నువ్వు తోపు అనుకోకు’.. రబడాను రెచ్చగొట్టి టీమిండియాపైకి ఉసిగొల్పిన డీన్ ఎల్గర్!

జొహన్నెస్‌బర్గ్: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ తుది ఫలితం మూడో టెస్టుకు చేరింది. గురువారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 240 పరుగుల లక్ష్యఛేదనలో విజయం కోసం మరో 122 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆట కొనసాగించిన సఫారీ టీమ్ 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి గెలుపొందింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డీన్ ఎల్గర్ (188 బంతుల్లో 10 ఫోర్లతో 96 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా...వాన్ డర్ డసెన్ (40), టెంబా బవుమా (23 నాటౌట్) అతనికి అండగా నిలిచారు.

రెచ్చగొట్టడంతో చెలరేగిన రబడా..
ఇక తొలి టెస్ట్‌లో విఫలమైన సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడా వాండరర్స్‌లో చెలరేగాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కీలక మూడు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. హాఫ్ సెంచరీలతో క్రీజులో పాతుకుపోయిన అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలను పెవిలియన్‌కు చేర్చి 111 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. దాంతో టీమిండియా.. సౌతాఫ్రికా ముందు 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే విధించింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రబడా చెలరేగడానికి సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ సూటి పోటీ మాటలే కారణమంట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఎల్గరే మీడియాతో పంచుకున్నాడు. భారత రెండో ఇన్నింగ్స్ ముందు ‘నీకు నీవు తోపు అనుకుంటే సరిపోదు.. ఆటతో చూపెట్టాలని రబడా'ను రెచ్చగొట్టానని ఎల్గర్ తెలిపాడు.

బౌలింగ్‌తో చూపించు..
‘రబడా దగ్గరకు వెళ్లి అతనితో మాట్లాడాను. మన గ్రూపులో నీ పట్ల అందరికీ గౌరవం, అభిమానం ఉంది. నువ్వు నీ గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావని నేను అనుకోవడం లేదు. బాగా బౌలింగ్ చేస్తున్నాననే అతి విశ్వాసంతో ఉంటావని కూడా భావించడం లేదు. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఎప్పుడైతే కేజీ తన ప్రతిభకు తగ్గట్లు రాణిస్తాడో... అప్పుడు తనను మించినోడు ఉండడు.'' అని చెప్పాను. తన సూటి పోటీ మాటలు రబడాపై ప్రభావం చూపాయని, బాగా ఆలోచించి ఉంటాడని, మరుసటి రోజు పక్కా ప్రణాళికతో వచ్చి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడని ఎల్గర్ తెలిపాడు.

రిలాక్స్ అయినప్పుడు రెచ్చగొట్టాలి..
ఒక్కోసారి రబడా రిలాక్స్ అవుతాడని, అలాంటి సమయంలో అతన్ని మోటివేట్ చేయాల్సి ఉంటుందని ఎల్గర్ సరాదాగా చెప్పుకొచ్చాడు. అద్భుత ప్రదర్శన కనబర్చిన తర్వాత రబడా తన దగ్గరకు వచ్చి తాను అన్న వ్యాఖ్యలను గుర్తు చేశాడని తెలిపాడు. ఇక మూడో టెస్టు ఈ నెల 11నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సౌతాఫ్రికా గడ్డపై మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ విజయం దక్కుతుంది. సెంచూరియన్ టెస్ట్‌లో అద్భుత విజయాన్నందుకున్న టీమిండియా.. జోహన్నెస్ బర్గ్ టెస్ట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications