
జోహన్నెస్‌బర్గ్: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మూడు రోజుల ఆట సజావుగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే నాలుగో రోజుపై వరుణుడు కన్నెర్ర చేశాడు. దాంతో నిర్ణీత సమయం గడిచినా ఇంకా మ్యాచ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వాండరర్స్ మైదానంలో చిరుజల్లులు పడుతున్నాయి. పిచ్‌ను మైదాన సిబ్బంది కవర్లతో కప్పేసారు. ఇక నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభంకానుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్వీట్ చేసింది. వర్షం కారణంగా అంతరాయం కలుగుతుందని మైదానానికి సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. చిరుజల్లులే కావడంతో పిచ్‌ను మాత్రమే కవర్లతో కవర్ చేశారు.
అయితే వర్షం రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పిచ్‌పై కవర్లు కప్పి ఉంచడంతో మాయిశ్చర్ వచ్చి బౌలర్లకు అడ్వాంటేజ్ అవుతుందని పేర్కొంటున్నారు. ఇక ఇరు జట్లను విజయం వరిస్తుంది. భారత్ గెలవాలంటే మరో 8 వికెట్లు తీయాల్సి ఉండగా.. సౌతాఫ్రికా మాత్రం 122 పరుగులు చేయాలి. ఆట సజావుగా సాగితే ఈ రోజే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు సౌతాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని అందుకునే ప్రయత్నంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (121 బంతుల్లో 2 ఫోర్లతో 46 బ్యాటింగ్), డసెన్ (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 85/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. అజింక్యా రహానే (78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58), చతేశ్వర్ పుజారా (86 బంతుల్లో10 ఫోర్లతో 53) అర్ధ సెంచరీలు చేయగా, హనుమ విహారి (84 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్ (కేఎల్ రాహుల్ 50, రవిచంద్రన్ అశ్విన్ 46, మార్కో జాన్సెన్ 4/31)
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్( కీగన్ పీటర్సన్ 62, శార్దూల్ ఠాకూర్ 7/61)
భారత్ రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్( రహానే 58, పుజారా 53, లుంగి ఎంగిడి 3/43)