
న్యూఢిల్లీ: పిచ్ కఠినంగా ఉండటంతోనే భారత్‌తో మూడో వన్డేలో ఘోర పరాజయం చవి చూసామని సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డేవిడ్ మిల్లర్ అన్నాడు. వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచడంతో బౌలర్లకు అనుకూలించిందని, బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిందన్నాడు. మంగళవారం ఏకపక్షంగా ముగిసిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డేవిడ్ మిల్లర్.. ఈ పరాజయం తీవ్రంగా నిరాశపరిచిందన్నాడు.
'పిచ్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంది. 99 పరుగులు చేసేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సిరీస్‌ను ఇలాంటి పరిస్థితుల్లో ముగిస్తామని అస్సలు అనుకోలేదు. వికెట్ స్పిన్‌కు అనుకూలించడంతో పాటు పేస్‌కు కూడా సహకరించింది. వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచడంతో కఠినంగా మారింది. జట్టుగా మేం కొన్ని విషయాల్లో మెరుగ్గానే రాణించాం. టీ20 తరహాలోనే వన్డేల్లోనూ మా బెస్ట్ పెర్ఫామెన్స్‌ను కొనసాగిస్తున్నాం'అని మిల్లర్ చెప్పుకొచ్చాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకు కుప్పకూలింది. జెన్నెమన్ మలాన్(15), హెన్రీచ్ క్లాసెన్(34), మార్కో జాన్సెన్(14)లు మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/18) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. మహమ్మద్ సిరాజ్(2/17), వాషింగ్టన్ సుందర్(2/15), షెహ్‌బాజ్ అహ్మద్(2/7) రెండేసి వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. అంతర్జాతీయ వన్డేల్లో సౌతాఫ్రికాకు ఇది నాలుగో లోయెస్ట్ స్కోర్ కావడం గమనార్హం.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ ఆడుతూ పాడుతూ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 105 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(57 బంతుల్లో 8 ఫోర్లతో 49), శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) రాణించారు. శిఖర్ ధావన్(8), ఇషాన్ కిషన్(10) ఆకట్టుకోలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, ఫర్చ్యూన్ చెరో వికెట్ తీసారు.