IND vs SA:చెలరేగిన బౌలర్లు.. సెంచూరియన్‌లో కోహ్లీ సేన సెన్సేషన్ విక్టరీ!

సెంచూరియన్: సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన 113 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెంచూరియన్ వేదికగా టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వర్షం కారణంగా కేవలం మూడున్నర రోజుల ఆటనే సాగగా.. భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
305 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. 191 పరుగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో కెప్టెన్ డీన్ ఎల్గర్(77), టెంబా బవుమా(35 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (3/50), మహమ్మద్ షమీ(3/63) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/47), రవిచంద్రన్ అశ్విన్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. సూపర్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జనవరి 3 నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనుంది.

డీన్ ఎల్గర్ పోరాడినా..
ఇక 94/4 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు ఆరంభంలో నిలకడగా ఆడింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గర్, టెంబా బవుమా ఆచితూచి ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఎల్గర్ అయితే వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. పిచ్ కూడా బ్యాటింగ్ సహకరిస్తున్నట్లు కనిపించడంతో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కానీ కోహ్లీ తన ట్రంప్ కార్డ్ జస్‌ప్రీత్ బుమ్రాను రంగంలోకి దింపి ఈ జోడీని విడదీసి ఫలితం రాబట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.

దెబ్బకొట్టిన సిరాజ్..
అనంతరం క్రీజులోకి క్వింటన్ డికాక్ రాగా.. టెంబా బవుమా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. బవుమా నెమ్మదిగా ఆడినా.. డికాక్ రెండు బౌండరీలతో జోరు కనబర్చాడు. అయితే మహ్మమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో డికాక్(21) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సౌతాఫ్రికా వికెట్ల పతనం మొదలైంది. క్రీజులోకి వచ్చిన వియాన్ ముల్డర్(1)ను మరుసటి ఓవర్‌లోనే మహమ్మద్ షమీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కో జాన్సెన్‌తో జాగ్రత్తగా ఆడిన బవుమా.. మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించాడు. దాంతో సౌతాఫ్రికా 182/7 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. లంచ్ బ్రేక్ ముగిసిన అనంతరం షమీ తన ఫస్ట్ ఓవర్‌లో జాన్సెన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌ను స్పిన్నర్ అశ్విన్‌కు ఇవ్వగా.. వరుస బంతుల్లో రబడా(0), లుంగి ఎంగిడి(0)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది.

సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 327 ఆలౌట్ (కేఎల్ రాహుల్ 123, మయాంక్ అగర్వాల్ 60, లుంగి ఎన్గిడి(6/71))
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 197 ఆలౌట్( టెంబా బవుమా 52, మహమ్మద్ షమీ 5/44)
భారత్ సెకండ్ ఇన్నింగ్స్: 174 ఆలౌట్ ( రిషభ్ పంత్ 34, రబడా 4/42)
సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్: 191 ఆలౌట్ ( డీన్ ఎల్గర్ 77, బవుమా 35 నాటౌట్, షమీ 3/63, బుమ్రా 3/50)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications