సౌతాఫ్రికా పర్యటనలో చివరి మ్యాచ్‌కు సిద్దమవుతున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్.. జనవరి 3(బుధవారం) నుంచి కేప్‌టౌన్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. శనివారం సెంచూరియన్ వేదికగా జరిగిన టీమ్ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషనల్‌లో శార్దూల్ ఠాకూర్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బౌన్సర్.. అతని ఎడమ భుజానికి బలంగా తాకింది. గాయం తీవ్రతపై స్పష్టత లేకున్నా.. శార్దూల్ ఠాకూర్ మాత్రం అసౌకర్యంగా కనిపించాడు. వెంటనే ప్రాక్టీస్‌ను ఆపేసాడు. బౌలింగ్ కూడా చేయకుండా హోటల్‌కు వెళ్లిపోయాడు. అయితే శార్దూల్ ఠాకూర్ గాయంపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం శార్దూల్ ఠాకూర్ అయిన గాయం చాలా చిన్నదని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని టీమ్ వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. టీమిండియా మెడికల్ టీమ్.. శార్దూల్ ఠాకుర్‌కు ఎలాంటి ట్రీట్‌మెంట్ చేయలేదని, కనీసం స్కానింగ్స్‌కు కూడా పంపించలేదని టీమ్ అధికారి ఒకరి చెప్పినట్లు పేర్కొంది.
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ దారుణంగా విఫలమయ్యాడు. 19 ఓవర్లు బౌలింగ్ చేసి 101 పరుగులిచ్చాడు. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి ఇన్నింగ్స్‌లో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన శార్దూల్ ఠాకూర్.. రెండో టెస్ట్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండో టెస్ట్‌కు శార్దూల్ ఠాకూర్ దూరమైతే.. టీమిండియా బ్యాటింగ్ మరింత బలహీనం కానుంది.
లోయరార్డర్‌లో కాసేపు క్రీజులో నిలబడి.. కీలక భాగస్వామ్యం నెలకొల్పే సత్తా శార్దూల్ ఠాకూర్‌కు మాత్రమే ఉంది. ఓవర్‌సీస్ కండిషన్‌లో శార్దూల్‌కు మెరుగైన బ్యాటింగ్ గణంకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఒకవేళ శార్దూల్ ఠాకూర్ రెండో టెస్ట్‌కు దూరమైతే ఆవేశ్ ఖాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్‌లతో కలిసి ఆవేశ్ ఖాన్ పేస్ బాధ్యతలను పంచుకోవాల్సి ఉంటుంది. తొలి టెస్ట్‌లో ప్రసిధ్ కృష్ణ దారుణంగా విఫలమవ్వడంతో అతనిపై వేటు వేయనున్నారు. వెన్ను గాయంతో తొలి టెస్ట్‌కు దూరమైన రవీంద్ర జడేజా అందుబాటులోకి రావడంతో.. అశ్విన్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.