సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం సెంచూరియన్ వేదికగా ఉత్కంఠగా సాగిన మూడో టీ20లో 11 పరుగుల తేడాతో గెలుపొందింది. సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సమష్టిగా రాణించింది. సిక్సర్ల వర్షం కురిసిన ఈ హైస్కోరింగ్ గేమ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్‌తో ఓటమి నుంచి గట్టెక్కించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 107) అజేయ శతకంతో చెలరేగగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆండిలే సిమలనె, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.

గెలిపించిన అర్ష్‌దీప్ సింగ్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. చివర్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో మార్కో జాన్సెన్(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 41) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు తలో వికెట్ దక్కింది.
శుభారంభం లేకున్నా
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(20)ను అర్ష్‌దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(21)ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చడంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో 2 వికెట్లకు 55 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్, ట్రిస్టన్ స్టబ్స్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా.. అక్షర్ పటేల్ దెబ్బతీసాడు. ట్రిస్టన్ స్టబ్స్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ధాటిగా ఆడిన ఎయిడెన్ మార్క్‌రమ్(29)ను వరుణ్ చక్రవర్తీ క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాస్, డెవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడారు. ముఖ్యంగా క్లాసెన్ భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.
క్లాసెన్ విధ్వంసం..
వరుణ్ చక్రవర్తీ వేసిన 14వ ఓవర్‌లో క్లాసెన్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. అయితే ఆ మరుసటి బంతికే అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ నేలపాలు చేశాడు. దాంతో ఊపిరి పీల్చుకున్న క్లాసెన్.. మరో బౌండరీ బాది ఈ ఓవర్‌లో 23 పరుగులు పిండుకున్నాడు. 58 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హార్డిక్ పాండ్యా విడదీసాడు. బౌండరీ లైన్‌పై అక్షర్ పటేల్ అందుకున్న కళ్లు చెదిరే క్యాచ్‌తో డేంజరస్ డేవిడ్ మిల్లర్(18)ను పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన మార్కో జాన్సెన్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన హెన్రీచ్ క్లాసెన్.. తిలక్ వర్మ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అయితే హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్‌లో మార్కో జాన్సెన్ 4, 6, 4, 2, 6, 6 బాది 26 పరుగులు పిండుకున్నాడు.
వణికించిన జాన్సెన్
దాంతో ఆఖరి ఓవర్‌లో సౌతాఫ్రికా విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతి డాట్ కాగా.. రెండో బంతిని జాన్సెన్ భారీ సిక్సర్ కొట్టి ఉత్కంఠకు తెరలేపాడు. ఈ సిక్స్‌తో జాన్సన్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిష్టీ నమోదు చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే అతను ఎల్బీగా ఔటవ్వడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.