IND vs SA: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనకు అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన తోడవ్వడంతో ఘన విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. ఫారీ బ్యాటర్లలో ఆండిలే పెహ్లుక్వాయో(49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 117 పరుగులు చేసి 200 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్(5) విఫలమైనా.. అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(43 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్, ఆండిలో పెహ్లుక్వాయో తలో వికెట్ తీసారు. ఐదు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం(డిసెంబర్ 19) జరగనుంది.
స్వల్ప లక్ష్య చేధనకు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5)ను ముల్డర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో కలిసి ఆచితూచి ఆడాడు.
దాంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. అనంతరం ఇదే జోరును కొనసాగించిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ముందుగా సాయి సుదర్శన్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ 44 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు.
విజయానికి 6 పరుగుల దూరంలో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఔట్ అవ్వగా.. తిలక్ వర్మ(1) సాయంతో సాయి సుదర్శన్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.