
రాజ్‌కోట్: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్‌క్రమ్ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను మిగతా రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆడడని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఏ) ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20 ముందు మార్‌క్రమ్ కరోనా బారిన పడ్డాడు. దాంతో అతను అక్కడే హోటల్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడని, కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాడని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
'పాజిటివ్‌గా తేలిన తర్వాత మార్‌క్రమ్ ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతను తిరిగి జట్టుతో చేరి సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. మార్కరమ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంటికి వెళ్లేందుకు కావాల్సిన అన్ని అనుమతులను అందుకున్నాడు. క్వారంటైన్‌లో మానసికంగా ఒత్తిడికి గురైన అతనికి కాస్త ఉపశమనం కలిగించేందుకే ఇంటికి పంపిస్తున్నాం.'అని క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటిన మార్‌క్రమ్ సేవలను కోల్పోవడం సౌతాఫ్రికాను ఇబ్బంది పెట్టే విషయమే.
ఇక గాయంతో బాధపడుతున్న డికాక్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్రికెట్ దక్షిణాఫ్రికా పేర్కొంది. 'మణికట్టు గాయానికి గురైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, క్వింటన్ డికాక్ కోలుకుంటున్నాడు. సౌతాఫ్రికా మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ అతన్ని గాయాన్ని పరిశీలించి నాలుగు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందా? అని అంచనా వేస్తుంది.'అని తెలిపింది.
ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌లను సునాయసంగా గెలిచిన సఫారీ టీమ్.. వైజాగ్ టీ20లో 48 పరుగులతో ఓటమిపాలైంది. 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 131 పరుగులకే ఆలౌటైంది. హర్షల్ పటేల్ నాలుగు, యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీసి బవుమా సేన పతనాన్ని శాసించారు. ఇక శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా జరగనున్న నాలుగో టీ20 కోసం ఇరు జట్లు సిద్దమవుతున్నాయి.