టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ20లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా తొలి బంతినే సిక్సర్ తరలించాడు. అతను కొట్టిన ఈ బంతి నేరుగా డగౌట్‌లో ఉన్న కెమెరామెన్ ఎడమ భుజానికి బలంగా తాకింది.
హార్దిక్ పాండ్యా సిక్స్‌ను గమనించని సదరు కెమెరామెన్ భారత డగౌట్ దృశ్యాలను కెమెరాతో రికార్డ్ చేస్తున్నాడు. వెంటనే ఫిజియోలు అతన్ని పరిశీలించి ఐస్ ప్యాక్ ఇచ్చారు. పెద్ద గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అంపైర్లతో పాటు ప్రేక్షకులు, కెమెరామెన్‌లకు ప్రమాదకరంగా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కార్బిన్ బోష్ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్(5) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. హార్దిక్ క్రీజులోకి వచ్చాడు. మరుసటి బంతినే మిడాఫ్ దిశగా సిక్సర్ బాదాడు. ఆ దిశలో బౌండరీ బయట కెమెరాతో ఉన్న వ్యక్తికి బంతి బలంగా తాకింది. జార్జ్ లిండే వేసిన మరుసటి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా ఉగ్రరూపం చూపించాడు. వరుసగా 4, 6, 6, 4 బాదాడు.
తిలక్ వర్మ ఓ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 27 పరుగులు వచ్చాయి. కార్బిన్ బోష్ వేసిన 17వ ఓవర్‌లో 6, 4, 6 బాదిన హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 2007 టీ20 ప్రపంచకప్ యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసింది. తిలక్ వర్మ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 73), హార్దిక్ పాండ్యా(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించారు. సంజూ శాంసన్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఓట్నిల్ బార్ట్‌మన్, జార్జ్ లింగే తలో వికెట్ తీసారు.