నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి ఆశించిన ఫలితాలను రాబట్టామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. గత 2-3 మ్యాచ్‌ల్లో మేం ముందుగా బ్యాటింగ్ చేసి అద్భుతంగా రాణించాం. దాంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నాం. తొలి మ్యాచ్ నుంచి మా ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయి. స్కోర్ బోర్డుపై భారీగా పరుగులు చేయడం.. తర్వాత డిఫెండ్ చేయడం మా వ్యూహం. ఒక రోజు వ్యత్యాసంతోనే ఈ మ్యాచ్ జరుగుతుంది.

చాలా త్వరగా జరుగుతున్నప్పటికీ మా ఆటగాళ్లు ప్రోఫెషనల్స్. ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయాలనే ఆశతో ఉన్న యశ్ దయాల్, విజయ్ కుమార్ వైశాఖ్‌లకు నిరాశే ఎదురైంది.
మరోవైపు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా? బౌలింగ్ ఎంచుకోవాలా? అనే సందిగ్దతలో ఉన్నానని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. 'బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకోవాలా? అనేదానిపై స్పష్టత లేకుండే. వాస్తవానికి మా బ్యాటింగ్ కాస్త బలహీనంగా ఉంది. మూడు విభాగాల్లో మేం 100 శాతం రాణించలేకపోయాం. ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటి మంచి ముగింపు ఇవ్వాలనుకుంటున్నాం.
మేం సిరీస్ గెలవలేం. తొలి మ్యాచ్ తర్వాత పుంజుకున్నాం. అదే ఆత్మవిశ్వాసంతో సిరీస్‌ను సమం చేయడానికి ప్రయత్నిస్తాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాం.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
భారత్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ
సౌతాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రీక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ, ఆండిలే సిమెలనే, కేశవ్ మహరాజ్, లుతో సిపమ్లా.